తెలంగాణలో ‘షిందే మోడల్’ కోసం బీజేపీ విఫలయత్నం చేసిందా? అంటే అవుననే అంటున్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మీడియా సాక్షిగా శుక్రవారం ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీ పార్టీలోని స్నేహితులు, కమలం పార్టీతో సన్నిహితంగా మెలిగే సంస్థల నుంచి తనకు ‘షిందే మోడల్’ ప్రతిపాదన వచ్చినట్టు తెలిపారు. అయితే వారి పేర్లు బయటపెట్టేందుకు ఆమె నిరాకరించారు.
ఏమిటీ షిందే మోడల్?
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన ఉదంతం ‘షిందే మోడల్’గా మీడియాలో పేరుకెక్కింది. శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిందే తిరుగుబాటు చేసి ఉద్ధవ్ సర్కారును కూల్చేశారు. బీజేపీ అండదండలతో అసంతృప్త ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకునిపోయి, అసోంలో క్యాంపు పెట్టి.. శివసేన తనదే అని ప్రకటించుకున్నారు. తర్వాత బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని అధిష్టించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఈ రాజకీయ నాటక సూత్రధారి బీజేపీ అన్నది బహిరంగ సత్యం. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఏక్‌నాథ్ షిందేలు ఉన్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు అగ్ర నేతలు గతంలో వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ కుటుంబం నుంచే షిందే మోడల్‌ను అమలు చేయాలని బీజేపీ ప్రయత్నించినట్టు తాజాగా కవిత వెల్లడించారు.
సున్నితంగా తిరస్కరించా
షిందే మోడల్ వలలో తాను చిక్కుకోలేదని కవిత తెలిపారు. ‘వారి ప్రతిపాదనను నేను చాలా సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత ఏం చేస్తారనేది వేరే కథ. మేం ప్రజా జీవితంలో ఉన్నాం. మేము ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ, రాజకీయ ఎత్తుగడల్ని ఎదుర్కొంటాం. తెలంగాణ ప్రజలు తమ పార్టీలకు, సొంత నాయకులకు ద్రోహం చేయరు. బ్యాక్‌డోర్ ద్వారా కాకుండా సొంత బలంతో నాయకులుగా ఎదుగుతాం. తన రాజకీయ జీవితం మొత్తం కేసీఆర్ గారితో కొనసాగుతుంది’అని కవిత పేర్కొన్నారు.
జై మోదీ.. నో ఈడీ..!
విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని మోదీ సర్కారు.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని కవిత ఆరోపించారు. జై మోదీ అంటే ఈడీ కేసులు ఉండవని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై పెద్ద సంఖ్యలో ఈడీ కేసులు నమోదు చేశారని.. ఒక్క బీజేపీ నేతపై కూడా కేసు పెట్టలేదని తెలిపారు. కమలం నాయకులపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రజలు ప్రశిస్తున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎటువంటి ప్రమేయం లేదని కవిత పునరుద్ఘాటించారు. (క్లిక్ చేయండి: తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతా.. కల్వకుంట్ల కవిత వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment