సాక్షి, హైదరాబాద్: బీజేపీలో గతంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందిపడి, భావోద్వేగాలతో పార్టీని వీడిన వారు, సైద్ధాంతిక భావాలున్న నేతలు తిరిగి పార్టీలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు బిచ్చమెత్తుకునే పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను పార్టీనేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తలు కూడా ప్రధాని, రాష్ట్రపతి అయ్యే అవకాశాలుంటాయన్నారు. పార్టీలో తాను తప్పు చేసినా అడిగే హక్కు కార్యకర్తలకు ఉంటుందని, తాను సరిచేసుకోకపోతే ఢిల్లీనాయకత్వానికి చెప్పే వీలుంటుందన్నారు. బీఆర్‌ఎస్‌లో ఆ పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు.
సినిమా గ్లామర్ ప్రపంచం. రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువ, అవన్నీ తట్టుకుని తెలంగాణ ఉద్యమకారిణిగా గర్జిస్తూ విజయశాంతి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషమన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.,. విజయశాంతి ఎవరికీ తలవంచకుండా పనిచేసి రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని రాష్ట్రపార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ ప్రశంసించారు.
నన్ను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు
టీఆర్‌ఎస్ నేతగా ఉన్నపుడే ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని విజయశాంతి చెప్పారు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రోజే తనను సస్పెండ్ చేశారన్నారు. ‘కేసీఆర్ ఒక విషసర్పం. ఆయనకు మరోసారి అధికారమిస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే రాష్ట్రం రాంగ్ పర్సన్ చేతుల్లోకి వెళ్లింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు.
చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్
Comments
Please login to add a commentAdd a comment