రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 55 సీట్లు గెలుస్తామని మాజీ సీఎం రమణ్ సింగ్ చేసిన వ్యాఖ్యపై బఘేల్ స్పందిస్తూ.. ఇది ఆయన చేసిన బూటకపు ప్రకటన అని కొట్టిపారేశారు.
రమణ్ సింగ్ వ్యాఖ్యలపై బఘెల్ మాట్లాడుతూ ‘రమణ్ సింగ్ ప్రజాదరణ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే 52 సీట్లను అధిగమించలేదు. ఇప్పుడు 55 సీట్లు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? ఆయన ఇదంతా తమ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచడానికే చెబుతున్నాడు. కనీసం 15 సీట్లయినా సాధిస్తారో లేదో ఫలితాలు వచ్చాక అందరికీ తెలిసిపోతుంది’ అన్నారు.
నవంబర్ 7న మొదటి దశ ఎన్నికల తర్వాత మాజీ సీఎం రమణ్ సింగ్ రాష్ట్రంలో బీజేపీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మొదటి దశ ఎన్నికలు ముగిశాయి. 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ 20 సీట్లలో బీజేపీ కనీసం 14 స్థానాలను గెలుచుకుంటుంది" అని రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలు ఉండగా నవంబర్ 7న తొలిదశ, నవంబర్ 17న రెండో దశతో ఎన్నికలు ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment