సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటింగ్‌లో ఫలితం సమం కావడంతో డ్రా కాగా.. టాస్‌లో తమ అభ్యర్థి హర్ష మహాజన్ నెగ్గినట్లు బీజేపీ ప్రకటించుకుంది. దీంతో సంఖ్యా బలం లేకున్నా బీజేపీని అదృష్టం వరించినట్లయ్యింది. అయితే ఈ ఫలితంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హిమాచల్ ప్రదేశ్ ఒక్క రాజ్యసభ సీటు ఉంది. దీనికి మంగళవారం ఓటింగ్ జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. రాజ్యసభ సీటు గెల్చుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కంటే ఐదుగురు కాంగ్రెస్‌కు ఎక్కువే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని అంతా భావించారు. అయితే..
సంఖ్యా బలం లేకున్నా అనూహ్యంగా రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపింది బీజేపీ. దీంతో ఓటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ జరిగిన ఓటింగ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకే ఓటేసినట్లు. దీంతో ఊహించని రీతిలో.. ఫలితం 34-34తో సమం అయ్యింది. డ్రా కావడంతో టాస్ అనివార్యం కాగా.. అందులో తామే నెగ్గినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జైరామ్ థాకూర్ ప్రకటన కూడా చేశారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారనంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ సర్కార్‌కు ముప్పు..
హిమాచల్ ప్రదేశ్ తాజా పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. రాజ్యసభ ఫలితం పరిణామంతో ప్రభుత్వం మెజారిటీలో లేదని స్పష్టమవుతోందని జైరామ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు. రేపటి బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వంపై ఫ్లోర్ టెస్ట్ ఒత్తిడికి డిమాండ్ చేస్తామని అన్నారాయన. ఒకవేళ.. అదే జరిగితే రెండేళ్లు తిరగకుండానే హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే విధంగా దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. హిమాచల్‌ను కోల్పోతే ఆ సంఖ్య రెండుకే పరిమితం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment