సాక్షి, హైదరాబాద్: కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరడంలేదని అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేస్తోంది. ఫిరోజ్‌గూడలో సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరడంలేదని ఇళ్లను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం.
అవి అక్రమ భూములు అయితే ఇన్ని రోజులు ఎందుకు కూల్చివేయలేదు. ప్రభుత్వ అధికారులు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురిచేయడం సరైన పద్దతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా పేదలు రోడ్డున పడ్డారు. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు. ఈ సమస్యపై మాట్లాడటానికి అధికారులు, మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడటం లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటికి ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు. ప్రభుత్వ చర్యలను కచ్చితంగా అడ్డుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment