టికెట్ల తూకం తప్పిందా? | BJP factions about ticket allotment in bjp | Sakshi
Sakshi News home page

టికెట్ల తూకం తప్పిందా?

Published Fri, Nov 3 2023 1:50 AM | Last Updated on Fri, Nov 3 2023 1:50 AM

BJP factions about ticket allotment in bjp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో కొత్త–పాత నేతలకు సమతూకంగా సీట్లు కేటాయించి ముందుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావించినా.. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలు దాన్ని ప్రతిబింబించడం లేదనే చర్చ మొదలైంది. పార్టీలో పాతకాపుల కంటే కొత్తగా వచ్చిన వారికి, గత మూడు నా లుగేళ్లలో పార్టీలో చేరిన ముఖ్య నేతల అనుచరుల కే పెద్దపీట వేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించుకోవడంలో పార్టీ ముఖ్య నేతలు సఫలమయ్యారని.. టికెట్లు ఆశించిన పలువురు ముఖ్య నేతలకు మొండి చెయ్యే ఎదురైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక బీసీ ఎజెండాతో ఆ వర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తామని పార్టీ నేతలు ప్రకటించిన అంశంపైనా చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం 88 సీట్లలో 32 సీట్లను (36.36 శాతం) బీసీ వర్గాలకు కేటాయించడం ఫర్వాలేదనే స్థాయిలోనే ఉందని, కానీ అంచనా వేసినదానికంటే లెక్క తక్కువగానే ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా 31 సీట్లను (జనసేనకు ఇచ్చేవి సహా) ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. లెక్కలు మారే అవకాశం ఉందని అంటున్నాయి. 

ముఖ్య నేతలకూ అందని టికెట్లు 
అంబర్‌పేట నుంచి మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు, చేవెళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం తదితరులకు చాన్స్‌ దక్కినా.. మరికొందరు ఆశావహులకు మాత్రం మొండిచెయ్యి ఎదురైంది. ముషీరాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేటలలో ఏదో ఒకచోటు నుంచి టికెట్‌ ఆశించిన బండారు విజయలక్ష్మికి, సికింద్రాబాద్‌ సీటు కోరుకున్న మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తదితరులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

ముషీరాబాద్‌ను పూసా రాజుకు, సికింద్రాబాద్‌ను మేకల సారంగపాణికి కేటాయించడంతో.. ఆ సీట్లను ఆశించిన వారికి అవకాశం పోయినట్టే. ఇక కార్పొరేటర్లలో రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డికి మాత్రమే చాన్స్‌ దక్కింది. ఎల్‌బీనగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, సికింద్రాబాద్, సనత్‌నగర్‌ తదితర చోట్ల టికెట్లు ఆశించిన కార్పొరేటర్లకు నిరాశే మిగిలింది. దీంతో వారు టికెట్‌ దక్కిన అభ్యర్థులకు సహకరిస్తారా? లేక రెబెల్స్‌గా పోటీచేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆ రెండు సీట్లపై పంతం 
హుస్నాబాద్, వేములవాడ సీట్ల విషయంలో బండి సంజయ్, ఈటల రాజేందర్‌ తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేయడంతో అభ్యర్థుల ఖరారు వాయిదా పడినట్టు తెలిసింది. హుస్నాబాద్‌ను ఈటల తన అనుచరుడు జన్నపరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇప్పించుకోవాలని ప్రయత్నించగా.. బండి తన అనుచరుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తికి ఇవ్వాలని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పట్టుబట్టినట్టు తెలిసింది.

ఇక వేములవాడలో మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావుకు ఇస్తే తనకు అభ్యంతరం లేదని బండి సంజయ్‌ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ వికాస్‌రావుకు ఇవ్వకుంటే, ఈటలకు రెండు చోట్ల పోటీ అవకాశం ఇచ్చినట్టే.. తనకూ కరీంనగర్‌తోపాటు వేములవాడ నుంచి పోటీ చాన్స్‌ ఇవ్వాలని సంజయ్‌ కోరినట్టు సమాచారం. మరోవైపు వేములవాడ స్థానాన్ని తుల ఉమకు కేటాయించేలా ఈటల గట్టి ప్రయత్నం చేస్తున్నారు. 

మూడో జాబితాపై నిరసనలు 
బీజేపీ మూడో జాబితాలో సీట్లు దక్కని కొందరు ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగర్‌ కర్నూల్‌ బీజేపీ టికెట్‌ ఆశిస్తున్న దిలీప్‌చారి గురువారం బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పొత్తులో భాగంగా జనసేనకు నాగర్‌ కర్నూల్‌ సీటు ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు. మరోవైపు ముప్పై ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్‌.మల్లారెడ్డి విమర్శించారు.

కొత్త వారికే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ సీనియర్‌ నేత పల్లపు గోవర్ధన్‌ బీజేపీకి రాజీనామా చేసి, బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకు బీసీ సీఎం నినాదంతో బలహీన వర్గాలను బీజేపీ నాయకత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. 

అసంతృప్తిలో బండారు విజయలక్ష్మి 
హరియాణా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అసంతృప్తితో ఉన్నారు. తాను ఆశించిన ముషీరాబాద్‌ సీటును వేరేవారికి కేటాయించడంపై ఆమె సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆమెను తమ పార్టీలో చేరాలంటూ టచ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. ఇక బండా కార్తీకరెడ్డి కూడా తనకు సీటు గ్యారంటీ అని భావించినా.. టికెట్‌ లభించకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  

కేటాయింపుల లెక్కలు ఇవీ.. 
బీజేపీ మొత్తంగా ఇప్పటివరకు 88 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 31 స్థానాలను (జనసేన పొత్తు కేటాయింపులు కలిపి) ఖరారు చేయాల్సింది.  
తొలిజాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒకరు, మూడో జాబితాలో 35మంది కలిపి 88 మందికి టికెట్లు ఇవ్వగా.. ఇందులో ఓసీలకు 34, బీసీలకు 32, ఎస్సీలకు 13, ఎస్టీలకు 9 కేటాయించారు. 
♦ తొలిజాబితాలో 12 మంది, మూడో జాబితాలో ఒకరు (హుజూర్‌నగర్‌ నుంచి చల్లా శ్రీలతారెడ్డి) కలిపి మొత్తంగా 13 మంది మహిళలకు సీట్లు ఇచ్చారు. 
♦ మైనారిటీ వర్గాలకు చెందిన ఒక్కరికి కూడా ఇప్పటివరకు టికెట్‌ కేటాయించలేదు. 
♦ బీసీలకు ఇచ్చిన 32 సీట్లలో.. ముదిరాజ్‌–గంగపుత్ర 7, గౌడ 6, మున్నూరు కాపు 5, యా దవ 4, పెరిక 2, లోథీ 2, బోయ 1, లింగా యత్‌ 1, విశ్వకర్మ 1, పద్మశాలి 1, ఆరె కటిక 1, ఆరె మరాఠాలకు 1 సీటును కేటాయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement