ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌కు తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. గురువారం నుంచి మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ శాసనసభ, మండలి సభ్యుల సమావేశం ఫడ్నవీస్ అధ్యక్షతన బుధ వారం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1993 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సహాయం చేశా రన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాబ్‌మాలిక్‌కు మహాప్రభుత్వం మద్దతివ్వడం సరికాదని, అతన్ని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. మాలిక్ రాజీనామాను కోరకుండా, ప్రభుత్వం ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను గత వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మార్చి 3 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. మహారాష్ట్ర వికాస్ ఆఘాది(ఎంవీఏ)అంటే... మహారాష్ట్ర దేనికీ తలవంచదని చెబుతారని, కానీ ఎంవీఏ దావూద్ ఇబ్రహీం ముందు తలవంచుతుందని, మహారాష్ట్ర ప్రజలతో మాత్రం మొండిగా ఉంటుందని ఫడ్నవీస్ చమత్కరించారు. ముంబై పేలుళ్లను మరిచిపోయి, వాటి నిందితుడి నుంచి మాలిక్ భూములు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. ఆ చర్యలతోనే ఎన్సీపీ నైతికత ఏంటో అర్థమవుతోందని తెలిపారు.
బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎంవీఏ ప్రభుత్వం ఎన్నిక నియమాలనే మార్చేసి దానికి గవర్నర్ ఆమోదం కోరుకుంటోందని, అదెలా సాధ్య మవుతుందని ప్రశ్నించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధినేత చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ... మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో మాలిక్ మంత్రివర్గం నుంచి వైదొల గకుంటే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే... బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో సంప్రదాయంగా ముఖ్యమంత్రి ఉద్ధావ్ థాకరే ఇచ్చే టీ పార్టీని బహిష్కరిస్తున్నామని బీజేపీ తెలిపింది. మార్చి 25వరకు బడ్జెట్‌సమావేశాలు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment