సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి సోదరుడైన శ్రీధర్ పాటన్కర్‌కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సుమారు రూ. 6.45 కోట్ల విలువలైన ఆస్తులను మంగళవారం జప్తు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..‘‘ మీరు(బీజేపీ) అధికారంలోకి రావాలంటే రండి. అయితే అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గపు పనులన్నీ చేయకండి. అధికారం కోసం మరొకరి కుటుంబ సభ్యులను వేధించకండి. మేము మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మీ(బీజేపీ) కుటుంబ సభ్యులు తప్పు చేశారని, కాషాయ నేతలను ఇబ్బంది పెట్టగలమని తాము చెప్పడం లేదు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమను(ఉద్ధవ్ ఠాక్రే, కుటుంబ సభ్యులు) జైలులో పెట్టాలనుకుంటే పెట్టండి’’ అని విమర్శించారు.
అంతకు ముందు.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకుని చంపేస్తారా? అని ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి నవాబ్ మాలిక్ నిజంగా దావూద్‌తో సంబంధాలుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని, ప్రశ్నించలేదని బీజేపీని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment