![BJP focus on poll management Telangana Assembly Elections - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/29/BJP-PARTY-1.jpg.webp?itok=v72Ob9Tp)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ బూత్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతోంది. బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ పర్యవేక్షణకు నియమించిన పన్నా ప్రముఖ్‌ల ద్వారా ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూడాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ కమిటీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడుతున్నారు. పార్టీ వైపు మొగ్గుచూపే ఓటర్లను కచ్చితంగా బూత్‌కు రప్పించేలా చేయడంలో లోటుపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని పార్టీ నాయకులు క్యాడర్‌కు స్పష్టం చేస్తున్నారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బుధవారం కూడా టెలికాన్ఫరెన్స్ చేపట్టి పోల్ మేనేజ్‌మెంట్‌పై తగిన సూచనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 వేల పోలింగ్ బూత్‌లకుగాను 90 శాతం బూత్‌లలో బీజేపీ సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంది.
జాతీయ నేతల ప్రచారంతో గెలుపుపై ధీమా...
రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు, ఓటింగ్ శాతం పెంచేందుకు దోహదపడుతుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మరికొన్ని చోట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర జిల్లాల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ప్రభావం చూపిందనే విశ్వాసాన్ని వారు వెలిబుచ్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment