సాక్షి, అమరావతి: రాజకీయంగా ఏ అంశంలోనూ తెలుగుదేశం పార్టీతో కలిసేదేలేదని బీజేపీ రాష్ట్ర శాఖ మరోసారి స్పష్టం చేసింది. చంద్రబాబు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎట్టి పరిస్థితులలో జరగదని తేల్చి చెప్పింది. ఆదివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పి.మురళీధరన్, జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునిల్ దియోధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులు పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను ఎమ్మెల్సీ మాధవ్ విలేకరులకు వివరించారు.
ఈనెల 21న యోగా దినోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. 28న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వర్చువల్ విధానంలో జరుగుతాయన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చర్చకు వచ్చినట్టు ఆయన తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అడ్డదారిలో ఆస్తి పన్నులు పెంచడం సిగ్గు చేటని, ప్రజలపై పెను భారానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖ భూ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయన్నారు.
టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు
Published Mon, Jun 14 2021 5:23 AM | Last Updated on Mon, Jun 14 2021 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment