సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కమలం పార్టీ ముఖ్యనేతల వర్గపోరుపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీకి రావాలంటూ పిలుపు ఇచ్చింది. దీంతో రేపో, మాపో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
తెలంగాణలో నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోంది. ప్రధాన నేతల ఆధిపత్య పోరు వల్ల తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో అర్థంకాక క్షేత్ర స్థాయి కేడర్ నుంచి పార్టీ బలహీనపడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ పరిణామాలు పార్టీని దెబ్బ తీసే స్థితికి చేరుకోవడంతో బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది. పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్తపడుతోంది.
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు, చేరిక కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నడుమ గ్యాప్ నెలకొన్న సంగతి తెలిసిందే. పొంగులేటితో ఈటల చర్చల సందర్భంగా ఈ విషయం బయటపడింది కూడా. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితంలో బీజేపీ డీలాపడింది. ఇలాంటి సమయంలో అప్రమత్తమై పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీని గాడిలో పెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment