ఎంఐఎం ఎజెండా ప్రకారమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నడుచుకుంటున్నాయి
ఆ మూడూ కుటుంబ పార్టీలే అని బీజేపీ అగ్రనేత అమిత్ షా ధ్వజం
యూపీఏ హయాంలో కుంభకోణాల్లో మునిగితేలారో, లేదో రేవంత్‌రెడ్డి చెప్పాలి
తెలంగాణను రజాకార్ల చెర నుంచి దూరం చేయగలిగేది బీజేపీనే
రాష్ట్రంలో 12 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం పోదు
బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఎంఐఎం ఎజెండా ప్రకారమే నడుచుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ మజ్లిస్‌కు భయపడి సభా సంప్రదాయాలు, నియమాలు తోసిరాజని అక్బరుద్దీన్‌ను ప్రొటెమ్ స్పీకర్ చేసిందన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడే ఈ మూడు కుటుంబ పార్టీలు హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చగలవా అని ప్రశ్నించారు.
అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తెలంగాణ ఆత్మగౌరవానికి ఏమాత్రం విలువ ఇవ్వవని ఆరోపించారు. మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ ట్యాగ్‌లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలను గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ జవహర్‌లాల్ నెహ్రూ మొదలు రాహుల్ గాంధీ వరకు, బీఆర్‌ఎస్ కేసీఆర్ నుంచి కేటీఆర్, ఆ తర్వాతి తరాలు.. ఎంఐఎం బడేమియా అసదుద్దీన్, చోటేమియా అక్బరుద్దీన్ అన్నట్టుగా తమ కుటుంబ ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తున్నాయన్నారు. రైతులు, ఓబీసీలు, యువత, మహిళలు, పేదల అభ్యున్నతి గురించి ఆ పార్టీలకు ఏమాత్రం పట్టదన్నారు.
బీజేపీ, ప్రధాని మోదీతోనే ఈ వర్గాల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని, డెబ్బై ఏళ్ల తర్వాత తెలంగాణను రజాకార్ల చెర నుంచి దూరం చేయగలిగేది బీజేపీ మాత్రమేనని అమిత్‌షా చెప్పారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయడం, దేశంలో బీజేపీ 400 సీట్లలో గెలవడం, తెలంగాణలో 12 సీట్లలో విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణలో మోదీ పట్ల ప్రజల్లో ప్రేమ చూస్తుంటే వచ్చేసారి 400 సీట్లు ఖాయంగా వస్తాయని అనిపిస్తోందన్నారు.
రేవంత్‌కు అమిత్‌షా సవాల్
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో బొగ్గు, కామన్వెల్త్‌గేమ్స్, 2 జీ, పంచకుల, అగస్టా విమానాలు ఇలా మొత్తం అవినీతి, కుంభకోణాల్లో మునిగితేలారో, లేదో చెప్పాలంటూ అమిత్‌షా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో తెలంగాణకు రూ.1.17 లక్షల కోట్లు వస్తే, మోదీ పదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు.
రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియా, కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్, పశ్చిమబెంగాల్లో తన మేనల్లుడిని సీఎంను చేయాలని మమతా బెనర్జీ, మహారాష్ట్రలో సుప్రియా సూలేను సీఎం చేయాలని శరద్‌పవార్, ఆదిత్యాఠాక్రేను సీఎం చేయాలని ఉద్ధవ్‌ఠాక్రే.. ఇలా కొడుకులు, కుమార్తెలు, అల్లుళ్లను పీఎంలు, సీఎంలు చేయాలని భావిస్తున్నారన్నారు.అవన్నీ సొంత ప్రయోజనాల పరిరక్షణకే పరిమితమైన పార్టీలని, మోదీ ప్రభుత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ను భ్రష్టాచార్ రిష్వత్‌కోరి సమితిగా అభివర్ణించిన అమిత్‌షా.. ఆ పార్టీ ఓఆర్‌ఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ మద్యం కుంభకోణాల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అదే సమయంలో 23 ఏళ్లపాటు సీఎంగా, ప్రధానిగా (పదేళ్లుగా) పనిచేసిన మోదీపై 25 పైసల అవినీతికి పాల్పడినట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపలేకపోయాయని చెప్పారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం కోసం శ్రమించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు, ఇతర రంగాల వారిని కలిసి కమలం గుర్తుకు ఓటేసేలా చైతన్యపరచాలని పార్టీ నేతలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
సీఏఏ.. పౌరసత్వాన్ని ఇవ్వడానికే...
దేశంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో ఎవరి పౌరసత్వం తొలగించబోయేది లేదని అమిత్‌షా స్పష్టంచేశారు. ఈ చట్టం అమలుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో కొందరు కేంద్రంపై, బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ పౌరసత్వాన్ని ఇచ్చేదే తప్ప తొలగించేది కాదన్నారు. దీని ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ వంటి దేశాల నుంచి భయంతో భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులకు మనదేశ పౌరసత్వం ఇస్తామని చెప్పారు.
కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించి లోక్‌సభ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసేలా నేటి నుంచే ప్రచారం మొదలుపెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటికే 9 లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన పార్టీ అభ్యర్థులు.. జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండిసంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), బీబీ పాటిల్ (జహీరాబాద్), పి,భరత్‌ప్రసాద్ (నాగర్‌కర్నూల్), మాధవీలత (హైదరాబాద్)లను సభికులకు అమిత్‌షా పరిచయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment