
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ చాలా బిజీ.. తెలంగాణ అభివృద్ధి కోసం రూ.11,360 కోట్ల పనుల ప్రారంభానికి మోదీ వస్తే కూడా హాజరు కాలేనంత బిజీ.. ప్రధాని వచ్చినా రాలేకపోయేంత ముఖ్యమైన పని ఆయనకు ఏముంది?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎంను నేను స్వయంగా కోరా. ఆయన కోసం ప్రత్యేకంగా సీటు కేటాయించాం.
సన్మానించేందుకు శాలువా కూడా తెచ్చిన. మరి సీఎం ఎందుకు రాలేదు?’ అని సంజయ్ నిలదీశారు. తన చర్యల ద్వారా సీఎం కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడిగా నిలిచిపోతున్నారని, ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని సభ ముగిసిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కార్యక్రమానికి హాజరుకాని కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ప్రధాని, గవర్నర్, కేంద్ర మంత్రులు వచ్చిన సభకు కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అభివృద్ధే ముఖ్యమని ప్రధాని చెప్పారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నాం. అలాంటి కార్యక్రమానికి సీఎం హాజరుకాని విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. తగిన సమయంలో కేసీఆర్‌కు బుద్ది చెప్పడం ఖాయం’ అని సంజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment