సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్‌ఎస్‌లో ఏక్‌నాథ్‌షిండేలు చాలామంది ఉన్నారు. అందుకే సీఎం కేసీఆర్ భయపడుతున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవాచేశారు. ‘కేసీఆర్ ముఖంలో భయం తాండవిస్తోంది,. ఒకవేళ ఆయన కుటుంబసభ్యుల్లోనే ఎవరైనా ఏక్‌నాథ్‌షిండేలు ఉన్నారేమో తెలియదు. అందుకే పదేపదే మహారాష్ట్ర పరిణామాలను గుర్తుచేసుకుని మాట్లాడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్‌కు సొంతపార్టీపై ఏదో తెలియని భయం వెంటాడుతోంది. నీ బోడి ప్రభుత్వంలో ఉండటం అవసరమా? అని నీ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నరు. మంచి పార్టీలోకి పోవాలని నీ పార్టీలోని ఏక్‌నాథ్‌షిండేలు ఆలోచిస్తున్నరు. అది తెలిసే ఆ పేరే తీస్తున్నవ్’అని వ్యంగ్యంగా అన్నారు.
ఆదివారం రాత్రి పొద్దుపోయాక సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘మేం అధికారం కోసమే ఆలోచిస్తే మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు తీసుకుంటం? మాకు అక్కడ సీఎం అయ్యే అవకాశమే ఉండేది.. నువ్వు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా?’అని నిలదీశారు. ‘దేశ్‌కీ నేత దిన్‌బర్ పీతా, మోదీపే రోత, ఫామ్‌హౌస్‌మే సోతా, అమవాస్య, పున్నమికి బాహర్ ఆతా’అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ఏం చర్చించారో నీకెందుకుని, బీజేపీ అగ్రనేతలపై అవాకులు, చవాకులు పేలడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ పేరు వింటేనే, ప్రధాని మోదీ అంటేనే కేసీఆర్‌కు నిద్రపట్టట్లేదని, అందుకే ఇన్ని రోజుల తర్వాత ఫామ్‌హౌస్ నుంచి బయటికొచ్చాక కూడా మోదీపై విమర్శలకు పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలో ప్రభావం కోల్పోతూ, ప్రతిష్ట దిగజారిందని గ్రహించిన కేసీఆర్ కేంద్రంపై, మోదీపై , బీజేపీపై విమర్శలు గుప్పించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. ఇకపై ప్రధానిపై, ఇతర అంశాలపై మాట్లాడేపుడు హద్దులు మీరొద్దని హెచ్చరించారు.
మేమూ నీ భాషే వాడితే..
‘ప్రధాని మోదీని గౌరవించలేని కుసంస్కారి కేసీఆర్. కేసీఆర్‌కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మోదీని ఉద్ధేశించి ఇష్టానుసారం కేసీఆర్ మాట్లాడడాన్ని ఖండిస్తున్నాం. మేం కూడా మీరు మాట్లాడే భాషనే ఉపయోగిస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు?’అని కేసీఆర్‌ను ఉద్దేశించి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ విమర్శలను తెలంగాణ సమాజమే హర్షించదన్నారు. గతంలో మోదీది నీతివంతమైన పాలనని కీర్తించిన నోటితోనే కేంద్రంలో అవినీతి సర్కార్ ఉందని విమర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ‘హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే కరీంనగర్‌లో బొందపెట్టిన సంగతి మర్చిపోయిండు. జోగులాంబ అమ్మవారు శక్తిపీఠం.
అటువంటి అమ్మవారిని ఈ అంబ.. ఆ అంబ అని చులకనగా మాట్లాడుతవా? నీకు మూడింది.. దగ్గర పడింది...నువ్వు దేవుడిని తిడతవా?.. ధర్మాన్ని తిడతవా? ఎందుకు బతుకున్నవో అర్థం కావడంలేదు.. ఇదే నీ రాజకీయానికి సమాధి అవుతుంది గుర్తుంచుకో.. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పు’అని సంజయ్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని పదవిని గౌరవిస్తవా? యోగి ఆదిత్యనాథ్ ను కించపరుస్తవా? అక్కడ తప్పు చేయాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చిన యోగి గురించి.. ఇక్కడ అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీసం పట్టుకోలేని నువ్వా మాట్లాడేది?’అని ప్రశ్నించారు. జనరంజక పాలన సాగిస్తున్నది కాబట్టే 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీల ప్రతినిధి ద్రౌపది ముర్ముకు ఓటేసి మద్దతు తెలపాలని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment