కేసీఆర్‌కు పాలించే అర్హత పోయింది | BJP State President Bandi Sanjay Criticizes CM KCR In Interview | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు పాలించే అర్హత పోయింది

Published Mon, Nov 28 2022 2:43 AM | Last Updated on Mon, Nov 28 2022 3:39 PM

BJP State President Bandi Sanjay Criticizes CM KCR In Interview - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఎనిమిదేళ్లలో ఇష్టారాజ్యంగా చేసిన రూ.5లక్షల కోట్ల అప్పులకు ఏటా రూ.30వేల కోట్లు వడ్డీల కిందే కడుతున్న కేసీఆర్‌ సర్కార్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను నిండా ముంచేస్తారని ఆరోపించారు. అందుకే ప్రజలంతా తమ క్షేమం కోరే బీజేపీ ప్రభుత్వం రావాలని గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌ కేవలం తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు చేపట్టిన నాలుగు విడతల యాత్రకు ప్రజలు మద్దతు తెలిపి అండగా నిలిచారని.. ఇక ముందూ విశేష స్పందన లభిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్రకు సిద్ధమైన నేపథ్యంలో బండి సంజయ్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలివీ.. 

సాక్షి: నాలుగు విడతల పాదయాత్ర ద్వారా ఏం సాధించారు? 
సంజయ్‌: ప్రజల వద్దకు వెళ్లి దగ్గరి నుంచి వారి బాధలను తెలుసుకున్నాం. రాష్ట్రంలో పేదలు, ఇతర వర్గాల వారు ఎదుర్కుంటున్న తీవ్ర సమస్యలను గుర్తించే ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలిచ్చాం. ఇళ్లు లేని పేదలకు పక్కాగృహాలు నిర్మిస్తామని చెప్పాం. 

ఐదో విడత లక్ష్యాలు, ఉద్ధేశాలేమిటి? 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గత 8 ఏళ్లుగా, అంతకు ముందు కాంగ్రెస్‌ హయాంలోనూ నిత్యం సమస్యలతో తల్లడిల్లుతూనే ఉన్న గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఈ విడత పాదయాత్ర నిర్వహిస్తున్నాం. యాత్రలో తెలుసుకునే అంశాలతో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి.. అధికారంలోకి వచ్చాక కచి్చతంగా అమలు చేస్తాం. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకున్నందున ఐదో విడత గతంలో జరిగిన వాటి కంటే సూపర్‌ సక్సెస్‌ అవుతుంది. ప్రతిసారి మా యాత్రలు, కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ వివిధ రూపాల్లో ఆటంకాలు కలి్పస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ తంటాలు పడుతున్నారు. 

రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది? 
మునుగోడు ఉప ఎన్నికలో మాదిరిగానే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి లోపాయకారీ ఒప్పందాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. అయినా తెలంగాణలో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం. కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వచి్చంది. ఎప్పుడు ఎన్నికలొచి్చనా టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబ, అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడి.. పేదల ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల కలలు నిజం చేసేలా బీజేపీ ముందుకు సాగుతుంది. 

మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతోందనే ఆరోపణలపై స్పందన? 
అవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్షనేతతోపాటు సుప్రీంకోర్టు సీజే కూడా ఉంటారు. అలాంటి సంస్థలపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు. పన్ను ఎగవేతలు, అక్రమాలపై ఐటీ, ఈడీ విచారణ చేపడతాయి. తప్పు చేయనప్పుడు భయమెందుకు? టీఆర్‌ఎస్‌ నేతలు భుజాలెందుకు తడుముకుంటున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 

‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ జాతీయ నేతలపై ఆరోపణలకు సమాధానం? 
ఇది కేసీఆర్‌ అండ్‌ కో ఆడుతున్న డ్రామా. అది జరిగింది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గెస్ట్‌హౌజ్‌లో.. అక్కడికి వచి్చంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. యాక్షన్‌ చేసింది కేసీఆర్‌ చెప్పినట్లు ఆడే పోలీసులు. అంతా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీపై బురద చల్లి ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర. కేసీఆర్‌ నీచ రాజకీయాలకు నిదర్శనం. 

కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారా? 
కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. ఢిల్లీ నుంచి గల్లీదాకా కనుమరుగవుతోంది. భారత్‌జోడో యాత్ర పేరుతో రాహుల్‌ గాంధీ దేశమంతా తిరుగుతున్నా జనం పట్టించుకోవడం లేదు. వాళ్లు పాదయాత్రలు కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా, పొర్లు దండాల యాత్ర చేసినా కాంగ్రెస్‌ను జనం నమ్మరు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌తో అంటకాగుతోంది. కాంగ్రెస్‌లో భవిష్యత్‌ లేదనే నిర్ణయానికొచ్చే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిరోజుల్లో ఆ పార్టీ ఖాళీ కాబోతోంది. గాందీభవన్‌కు ‘టు లెట్‌’ బోర్డు తగిలించే పరిస్థితి రాబోతోంది.  

కేసీఆర్‌ను జనం అసహ్యించుకుంటున్నారు 
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అందుకే సీఎం కేసీఆర్‌ అభివృద్ధిని పక్కనపెట్టి.. కేంద్రాన్ని, ›ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించడం, అర్థం లేని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్‌ వైఖరిని, టీఆర్‌ఎస్‌ నేతల తీరును, చేస్తున్న విమర్శలను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 
    – బండి సంజయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement