సంజయ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న మోదీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో కాషాయ రాజ్యం స్థాపించి, కేసీఆర్ గడీలు బద్దలు కొడతామని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ పాల నపై విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు ఆయన పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. శనివారం హనుమకొండ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ సభలో పాల్గొన్న బండి సంజయ్.. భావోద్వేగ ప్రసంగం చేశారు.
సాధారణ కార్యకర్తగా ఉన్న తనను పార్టీ, కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా చేసిందని, అంతేకాక రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చిందని.. బీజేపీకి రుణపడి ఉంటానని అన్నారు. ‘శిరస్సు వంచి దండాలు పెడుతున్నా.. బీజేపీ జెండాను మోసిన భుజం అన్నా, 140 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇచ్చే మహానుభావుడు మోదీ భుజం తడితే ఎట్లా ఉంటదో ఈ నా భుజాన్ని అడిగితే చెబుతుంది’అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఒక్కసారి ప్రధాని మోదీ తన నోటినుంచి సంజయ్.. అని ఎప్పుడంటారా? అని ఎదురు చూసిన’అని అన్నారు.
ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత ప్రధాని మోదీ అని కొనియాడారు. ‘నన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు దండాలు.. మా జాతీయ నాయకత్వం నన్ను రాష్ట్ర అధ్యక్షుడినిగా చేసింది. మోదీగారు నా భుజం తట్టి బండి.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఈ జన్మకు ఇది చాలు. రాబోయే రోజుల్లో కిషన్‌రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ సర్కార్ గడీలను బద్దలు కొడతాం. తెలంగాణలో మోదీ రాజ్యం... కాషాయ రాజ్యం స్థాపించేందుకు నిరంతరం కృషి చేస్తాం’అని పేర్కొన్నారు.
మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన దీటుగా స్పందించారు. ‘రూ.6,100 కోట్ల నిధులను తెలంగాణకు తెచ్చేందుకు మోదీ వచ్చారు. వరంగల్‌కు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ తేవడానికి వచ్చారు. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు వచ్చారు’అంటూ ఎదురుదాడి చేశారు.
మరి సీఎం కేసీఆర్ ఇక్కడికి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. మోదీ వద్దకు రావడానికి కేసీఆర్‌కు ముఖం చెల్లడం లేదని, ఆయనను చూస్తేనే కేసీఆర్‌కు జ్వరం, కోవిడ్‌లు వస్తాయని ఎద్దేవా చేశారు. మీరు జై మోదీ.. అనే నినాదాలు చేస్తే కేసీఆర్ చెవుల నుంచి రక్తం కారాలంటూ సభికులను ఉత్సాహపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment