సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన ఇంటిలో అర్ధనగ్నంగా కూర్చుని పార్టీ జిల్లా నాయకురాలితో అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియో కాల్ మంగళవారం వైరలైంది. దీంతో కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. వివరాలు.. యూట్యూబ్ చానల్ నడుపుతున్న తనపేరు మదన్ అని.. బీజేపీ ప్రముఖుడినని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ ‘‘గతంలోనూ బీజేపీ మహిళా నేత లతో ఆయన అసభ్య చేష్టలను రికార్డు చేశాను. బీజేపీకి చెందిన 15 మంది నేతలకు సంబంధించిన ఇలాంటి అసభ్యకర వీడియోలు, ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కేటీ రాఘవన్ తనను తాను పెద్దమనిషిగా చాటుకుంటున్నందునే ఆయన వీడియోలు బయటపెట్టాను. అతడి వికృత చేష్టల వల్ల బాధితులైన ఎందరో గృహిణులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 60 వీడియోలు విడుదల చేస్తాను’’ అని వెల్లడించారు.
పదవికి రాజీనామా చేసిన కేటీ రాఘవన్
తనను, పార్టీని అప్రతిష్ట పాలుజేసేందుకే సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వీడియోను విడుదల చేశారని కేటీ రాఘవన్ ఫేస్‌బుక్‌లో పోస్టులో ఆరోపించారు. తన గురించి ప్రజలకు తెలుసన్నారు. పార్టీ అధ్యక్షుడు అన్నామలైని కలిశాను.. ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని పేర్కొన్నారు. కాగా కేటీ రాఘవన్ వ్యవహారంపై అన్నామలై విచారణ బృందాన్ని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment