165 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఎలా?  | BJP Leader Raghunandan Fires On Niranjan Reddy | Sakshi
Sakshi News home page

165 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఎలా? 

Published Wed, Apr 19 2023 1:44 AM | Last Updated on Wed, Apr 19 2023 1:44 AM

BJP Leader Raghunandan Fires On Niranjan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్‌రావు విమర్శించారు. ప్రభుత్వ భూములు, ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను బీఆర్‌ఎస్‌ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల మీద  కన్నేసి ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణా నదిని కబ్జా చేసి, రీ సిల్టింగ్‌ చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ కట్టుకుంటే తాము కట్టుకోవద్దా అని మంత్రులు కూడా ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారన్నారు. రఘునందన్‌రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

మూడు ఫామ్‌హౌస్‌లు కట్టిన వ్యవసాయ మంత్రి 
‘వ్యవసాయ శాఖ మంత్రి మొత్తం మూడు ఫామ్‌హౌస్‌లు కట్టారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాల విసీర్ణంలో ఒక ఫామ్‌హౌస్‌ నిర్మించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టారు. ఈ భూమిలో మూడున్నర ఎకరాల సీసీ రోడ్డు నిర్మించారు. గిరిజనుల పేరిట రూ.7 కోట్ల సబ్సిడీ రుణం తీసుకున్నారు. మంత్రి 80 ఎకరాలు కొని.. 165 ఎకరాల ఫామ్‌హౌస్‌ ఎలా కట్టారు?. నదిలో గోడ కట్టడంతో పాటు, మట్టి నింపి రీ సిల్టింగ్‌ చేయడం.. ఇవన్నీ నేరాలే. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఓ గిరిజన సోదరి పేరు నుంచి మంత్రి కుటుంబసభ్యుల పేర్లపైకి బదిలీ అయ్యాయి.

ఆ తర్వాత రెగ్యులరైజ్‌ చేసుకుని కాంపౌండ్‌ వాల్‌ కట్టడం జరిగింది. మానవపాడు మండల తహశీల్దార్‌ కార్యాలయం 2021 అక్టోబర్‌లో తగలబడి ఈ ఫామ్‌హౌస్‌ భూములకు సంబంధించిన రికార్డులు కాలి బూడిదయ్యాయి. అధికారులు కేసు పెట్టాక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినా, ఇప్పటివరకు చార్జిషీట్‌ వేయలేదు. ఇదిలావుండగా పాన్‌గల్‌ మండలం కొత్తపేట గ్రామ పంచాయితీలో వంద ఎకరాల్లో మంత్రి నిరంజన్‌ రెడ్డి మరో ఫామ్‌హౌస్‌ కట్టారు. పెద్ద మందాడి మండలం మోజర్ల సమీపంలో 50 ఎకరాల్లో ఇంకొక ఫామ్‌హౌస్‌ కట్టారు. ఇంకా చాలామంది మంత్రుల ఫామ్‌హౌస్‌ల చరిత్రలు నా వద్ద ఉన్నాయి..’అని రఘునందన్‌ చెప్పారు.  

మంత్రిపై చర్యలు తీసుకోవాలి 
‘గతంలో ఇలాంటి ఆరోపణలపై ఈటల రాజేందర్‌ను, అంతకుముందు ఓ దళిత మంత్రిని కేబినెట్‌ నుంచి తొలగించారు. మరి ఇప్పుడు నిరంజన్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోవడం లేదు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఒక న్యాయం.. అగ్రకులాల వారికి మరో న్యాయమా? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది.

అవినీతిని ఉపేక్షించకుండా సీఎం కేసీఆర్‌ మంత్రిపై చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను కబ్జా చేస్తున్న వారిని, తహసీల్‌ ఆఫీస్‌లను తగులబెట్టి, రికార్డులు లేవు కాబట్టి తమ పేరిట ఆస్తులు మార్చుకోవాలని చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి..’అని రఘునందన్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఇతర వేదికలను కూడా ఆశ్రయిస్తామని అన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement