సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో 18 నుంచి 22 సీట్ల వరకు గెలుస్తామని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 10 నుంచి 12, అలాగే గ్రేటర్ పరిధిలో 4, రంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్క సీటు గెలుపుపై బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్‌లలో గురువారం రాత్రి దాకా పోలింగ్ కొనసాగడంతో ఆయా ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయానికి సమాచారం ఆలస్యంగా చేరింది.
క్షేత్రస్థాయి సమాచారం, పార్టీ నాయకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ముఖ్యనేతలు పార్టీ గెలిచే స్థానాలపై ఈ అంచనాకు వచ్చినట్లు చెపుతున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతో బీజేపీ ముఖాముఖిగా పోటీపడుతున్న సీట్లతో పాటు, ఈ మూడుపార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల అనూహ్య ఫలితాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. కనీసం 25 నుంచి 30 సీట్లలో గట్టి పోటీనివ్వడంతో పాటు, పార్టీ బలంగా ఉన్న చోట్ల ఓటింగ్ శాతం పెరగడం ద్వారా 15 నుంచి 20 శాతం దాకా బీజేపీ ఓటింగ్ శాతం నమోదు చేస్తుందని విశ్వసిస్తున్నారు.
కాగా, పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 111 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగడం, ఇతర సానుకూల అంశాలపై నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గురు, శుక్రవారాల్లో వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో బీజేపీకి అంతగా సానుకూలత కనిపించకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాక వాస్తవ పరిస్థితిని బేరీజు వేయాల్సి ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment