సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపాలిటీ.. ఎన్నికలేవైనా అర్బన్ ప్రజలలో ఎక్కువ శాతం ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఎన్నికల రోజున నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఇంట్లోనో, మరోచోటో సెలవును ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. గత రెండు శాసనసభ ఎన్నికల నుంచి ముంబై మినహా అన్ని మెట్రో నగరాల్లోనూ పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల ప్రాముఖ్యత, ఓటు హక్కు గురించి ఎంతగా ప్రచా రం చేస్తున్నా ఫలితం ఉండటం లేదు.
పెరిగిన అర్బన్ ఓటర్లు
1951–52లో దేశంలో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికలలో 17.3 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా.. ఇందులో 17 శాతం ఓటర్లు మాత్రమే పట్టణాలలో నివసించేవారు. కాలక్రమేణా ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస రావడం పెరిగింది. ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం, మెరుగైన జీవనశైలి వంటి రకరకాల కారణాలతో పట్టణాలకు వస్తూ స్థిరపడిపోతున్నారు. దేశంలో 543 లోక్‌సభ స్థానాలుండగా.. 100 స్థానాలలో పట్టణ జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు.
దక్షిణాదిలో హైదరాబాద్‌లోనే తక్కువ
దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదవుతోంది. హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోలింగ్ 50 శాతం కూడా మించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. 2009లో 58 శాతం, 2014లో 53, 2018లో 50.86 శాతం పోలింగ్ నమోదయింది.
తాజా ఎన్నికలలో భాగ్యనగరంలోని 15 నియోజకవర్గాలలో నమోదైన పోలింగ్ కేవలం 46.65 శాతమే కావడం గమనార్హం. నగరంలోని యాకుత్‌పురాలో 39.6 శాతం పోలింగ్ నమోదు కావడం శోచనీయం. ఈ ఏడాది మేలో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బెంగళూరు అర్బన్‌లో 54.6 శాతం పోలింగ్ జరిగింది. 2018లో ఇది 56 శాతంగా ఉంది. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలో 59.06 శాతం పోలింగ్ జరిగింది.
ఎందుకిలా..?
నిర్లిప్తత, నిర్లక్ష్యం, సెలవు రోజును ఇతర పనులకు ఉపయోగించుకోవాలనే అభిప్రాయం, సరదాగా గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి కారణాలతో పాటు.. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండటం కూడా పోలింగ్ శాతం తగ్గడానికి ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతూరు, పనిచేసే ప్రాంతం రెండు చోట్లా ఓటు ఉన్న అర్బన్ ఓటర్లు ఎన్నికల రోజున వివిధ కారణాలతో సొంతూళ్లకు తరలిపోవడంతో అర్బన్ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తగ్గుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి రావడం వల్ల కూడా అర్బన్ ఓటర్లు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏం చేయాలి మరి?
♦ ఓటు వేసిన వారికి మాత్రమే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి.
♦ అర్బన్ ప్రాంతాలలో ఒకరికి ఒకచోటే ఓటు హక్కు ఉండేలా చూడాలి.
♦ ఓటర్లకు సాధ్యమైనంత చేరువలోనే పోలింగ్ కేంద్రం ఉండాలి.
♦ పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలి. పొడవాటి క్యూలు నివారించాలి.
♦ క్యూలైన్, పోలింగ్ సరళి సమాచారం ఓటర్లకు మెసేజ్ రూపంలో ఇవ్వాలి.
♦ పోలింగ్ బూత్‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను ఓటర్లకు పంపించాలి.
Comments
Please login to add a commentAdd a comment