‘ఎగ్జిట్‌ పోల్స్‌’ కంటే మిన్నగా.. | BJP leaders Telangana Assembly Election Results | Sakshi

‘ఎగ్జిట్‌ పోల్స్‌’ కంటే మిన్నగా..

Published Sun, Dec 3 2023 5:25 AM | Last Updated on Sun, Dec 3 2023 5:25 AM

BJP leaders Telangana Assembly Election Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల గురించి బీజేపీ ముఖ్యనేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక సీట్లు వస్తాయని తాము భావిస్తుంటే సర్వే సంస్థలు మాత్రం నామమాత్రపు ఫలితాలు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. తమ అభ్యర్థులు బరిలో నిలిచిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టిపోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలిచే అవకాశాలున్నాయని ఎన్నికల సరళిని విశ్లేషించి చెబుతున్నారు. ఓటింగ్‌ శాతం కూడా 2018లో వచ్చిన ఏడు శాతం పోలిస్తే ఈసారి 20 శాతం వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. 

గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో... 
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ ఐదు రోజుల ప్రచారంలో మొత్తం 8 సభలు, ఓ రోడ్‌ షో, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 22 బహిరంగ సభలు, రోడ్‌ షోలు, ఇంకా పెద్ద సంఖ్యలో సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అగ్రనేతల ప్రచారం తాలూకు ఫలితాలు తప్పకుండా ఓట్లు, సీట్ల రూపంలో ప్రతిబింబిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బీసీ నినాదం, అధికారంలోకి వస్తే బీసీ నేత సీఎం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క–సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుతోపాటు వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా మేనిఫెస్టోలో ప్రస్తావించిన వివిధ అంశాలు తప్పకుండా పారీ్టకి ఎన్నికల్లో కచ్చితంగా ఉపయోగ పడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. 

కిషన్‌రెడ్డిని కలిసిన పలువురు పార్టీ అభ్యర్థులు  
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మార్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎన్నికల్లో పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌), ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు), తోకల శ్రీనివాస్‌రెడ్డి (రాజేంద్రనగర్‌) తదితరులు కలిశారు. ఈ సందర్భంగా పోటీ చేసిన స్థానాల్లో పార్టీకున్న విజయావకాశాలు, అభ్యర్థులకు కలిసొచ్చే అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.  

పరిశీలకులను పంపిస్తున్నాం... 
ఓట్ల లెక్కింపు సందర్భంగా పార్టీ గెలిచే అవకాశాలు, గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పర్యవేక్షణకు తమ పార్టీ నుంచి పరిశీలకులను పంపిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలంతా ఎప్పటికప్పుడు ఫలితాల సరళిని పరిశీలించి పార్టీ జిల్లా నేతలు, అభ్యర్థులకు తగిన ఆదేశాలు జారీ చేస్తారన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి వెంటనే స్పందించి ఈసీకి ఫిర్యాదు చేసేలా బీజేపీ లీగల్‌ సెల్‌ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement