సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమలదళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పటికే తప్పు బట్టగా తాజాగా ఆర్వింద్ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీని యర్ నేత పేరాల శేఖర్‌రావు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం పార్టీ నేతల్లో మరింత కలకలా నికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్‌రావు వ్యాఖ్యలను సమ ర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్‌పై శేఖర్‌రావు మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
పార్టీ నేతల్లో గందరగోళం..! అర్వింద్‌కు అధిష్టానం నోటీసులు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పార్టీ ఎంపీ అర్వింద్ బహిరంగ విమర్శలు చేయడంపై ఇప్పటికే పంచాయితీ ఢిల్లీ అధిష్టానం వద్దకు చేరింది. ఈ వ్యవహారంపై అర్వింద్‌కు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అధిష్టానం నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.
శేఖర్‌రావు ఏమన్నారంటే...
రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ వంటి పెద్దలు చేయాల్సిన పనినే అర్వింద్ చేశారని శేఖర్‌రావు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అధ్యక్షుడి పరిణతిలేని అసందర్భ మాటలు, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ప్రస్తుత పరిస్థితి కారణమని దుయ్యబట్టారు. బ్లాక్‌మెయిల్, అంతర్గత సెటిల్‌మెంట్లు, కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, వాడుకొని వదిలేసే విధానం బీజేపీ సంస్కృతి కాదని శేఖర్‌రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇవన్నీ పార్టీలో యథేచ్చగా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్‌లో గ్రానైట్ క్వారీల్లో అక్రమ తవ్వకాలంటూ ప్రచారం చేసి యజమానులతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓ వార్తా చానల్‌లో ఓ ప్రముఖుడి మైనింగ్ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఆపై సెటిల్‌మెంట్లు చేసుకోవడం, ఆ చానల్‌లో నలుగురు పార్టీ నేతలతో రూ. కోట్లలో పెట్టుబడి పెట్టించి నట్టేట ముంచడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైస్‌చైర్మన్ పదవిని ఆర్థిక కారణాలతో కొత్తవారికి కట్టబెట్టడం, హుజురాబాద్‌లో ఈటల గెలుపు అనంతరం ఏర్పడిన వాతావరణాన్ని ఖతం చేయడం వంటి చర్యలకు బండి సంజయ్ పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. వాటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్ మీడియానే ఆధారమవుతోందని శేఖర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment