పందిల్లలో బండి సంజయ్ పాదయాత్ర
సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తొలి విడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నేడు ముగియనుంది. ఆగస్టు 28న హైదరాబాద్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు వింటూ వారికి భరోసానిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సంజయ్ పాదయాత్ర కొనసాగింది.
ఈ యాత్రలో ఇద్దరు మాజీ సీఎంలు, ఆరుగురు కేంద్ర మంత్రులు సహా 24 మంది జాతీయ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. నేటి రోడ్‌షో, సభను లక్ష మందితో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతీఇరానీ రోడ్‌షో, సభకు హాజరుకానున్నారు. హుస్నాబాద్ అంతా ప్లెక్సీలు, జెండాలతో కాషాయమయం అయింది. సభను విజయవంతం చేయాలని యాత్ర ఇన్‌చార్జి మనోహర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
గౌరవెల్లి, గండిపల్లిపై సీఎం వివక్ష...
గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన వివక్ష చూపుతూ హుస్నాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభమై 12 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తి చేయకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. శుక్రవారం 35వ రోజు సిద్దిపేట జిల్లా పొట్లపల్లి నుంచి హుస్నాబాద్ వరకు యాత్ర సాగించిన సంజయ్.. దారిపొడవునా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ‘1.14 టీఎంసీ నీటి సామర్థ్యంతో గౌరవెల్లి, 0.4 టీఎంసీ సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులకు 2009లో శంకుస్థాపన చేశారు.
రైతుల నుంచి 1,836 ఎకరాలు సేకరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీడిజైన్ పేరుతో 2017లో 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి అదనంగా 2 వేల ఎకరాలు సేకరించారు. దీంతో 7 గిరిజన తండాలు ముంపునకు గురవుతున్నా బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందజేయకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్ నియోజకవర్గానికి, అల్లుడి నియోజకవర్గానికి ఒక న్యాయం.. హు స్నాబాద్‌కు ఇంకో న్యాయమా?’అని హెచ్చరించా రు. కాగా పాదయాత్ర విజయవంతంగా సాగ డం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి బండి సంజయ్‌ను అభినందించారు. ఇక ముందు రాష్ట్రం లో ఇలాగే ముందుకు సాగాలని సూచించారు.
పాదయాత్ర సాగిందిలా..
మొత్తం రోజులు: 36 (మధ్యలో రెండురోజులు విరామం)
కిలోమీటర్లు: 438
జిల్లాలు: 8 (హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట)
అసెంబ్లీ నియోజకవర్గాలు: 19 (చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్)
పార్లమెంట్ నియోజకవర్గాలు: 6 (హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్)
రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల నుంచి వినతులు: 11,675
Comments
Please login to add a commentAdd a comment