
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఈ రోజు నుంచి ఆసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్లకార్టు ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ఎమ్మెల్సీ రామచంద్రారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారని, కేసీఆర్‌కు దమ్ముంటే తమకు సభలో సమయం ఇవ్వాలన్నారు. ఎంఐఎంకు ఎంత సమయం ఇస్తున్నారో తమకు అంతే సమయం ఇవ్వాలన్నారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, డబుల్ బెడ్‌రూం, టీజర్లు, రైతుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతామని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎన్‌పై వాయిదా తీర్మాణం పెట్టామని, దానిపై చర్చ జరగాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పీఆర్పీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళవ విప్పుతామన్నారు. అంతేగాక నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డిలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ లోపలికి ప్రవేశించారు.