సాక్షి, హైదరాబాద్: హైడ్రా అంటే ఒక డ్రామా అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. పేదల జోలికి వచ్చిన ప్రభుత్వం ఏదీ చరిత్రలో నిలిచిన దాఖలులేవని రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట బోయిన చెరువు చుట్టూ ఇల్లు కట్టుకున్న పేదలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లి.. ఆ ప్రాంతాన్ని ఈటల గురువారం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా అంటే ఒక డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాలనపై కనీస అవగాహన లేదు. పేదల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు నిలవలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలకు వారికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడెందుకు హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారు.
ఒక మంత్రిగానో, ఐదేళ్ల పాటు సరైన ఎంపీగానో పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేదోళ్ల బాధ తెలిసేది. బఫర్ జోన్‌లో ఉన్నారంటూ 40 ఏళ్ల తరువాత పేదోళ్ల ఇండ్లకు నోటీసులు ఎలా ఇస్తారు. రేవంత్ ఏదో ఉద్దరిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పొగడటం సరైన పద్దతి కాదు. పేదల జోలిక వస్తే ఊరుకునేది లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment