సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారు కానీ.. మహిళలకు సీట్లను మాత్రం కేటాయించలేదన్నారు.
ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించాం. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన ప్రకటించవచ్చు. బీజేపీ నుంచి కొంతమంది ఎంపీలు అసెంబ్లీ బరిలోకి దిగుతారు. బీజేపీ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారు.
నేను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. నా రాజ్యసభ పదవి కాలం అయిదేళ్లు ఉంది. అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తాను. కిషన్ రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. జనసేనకు కూడా కొన్ని టికెట్లు ఇస్తాం. రెండో జాబితా ఈ నెల 29 తర్వాత ఉంటుంది. రాజా సింగ్ సస్పెన్షన్, ఎన్నికల్లో పోటీ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. బీసీల ఓట్లు తీసుకొని అగ్రకులాలు గద్దె నెక్కుతున్నాయి. అభ్యర్థుల మొదటి విడతలో బీసీలకు 20పైగా సీట్లు కేటాయిస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీల సేవలు వాడుకుని వదిలేస్తున్నారు. బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోంది. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీసీలను బానిసలుగా చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు బీసీలకు బీజేపీ కేటాయిస్తుంది’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు!
Comments
Please login to add a commentAdd a comment