సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమీ మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.
కాగా, నేడు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం, రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశాం. రైతులకు రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రూప్-1 పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు 30 రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటు.
కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు. డీఎస్సీ ఒక నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. మేము వారికి మద్దతు ఇస్తున్నాము. నెలకు నాలుగు లక్షల నెల జీతం ఏడు మాసాలుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. అధికారులను అరెస్ట్ చేస్తున్నారు.. పనులు చేయించిన అప్పటి మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. ఒక్కో మంత్రి ఒక్కో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.
ధరణి పరిస్థితి ఏంటి?. ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవులు భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజులుగా వెళ్లున్నారు. పంచాయతీల కాల పరిమితి ముగిసింది. వెంటనే ఎన్నికలు జరపాలి. కులగణన త్వరితగతిన పూర్తి చేయాలి. ఎన్నికలు వాయిదా వేసేందుకు డ్రామాలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నెలకు 1200 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment