కోల్‌కతా: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలందరినీ జైళ్లకు పంపుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక వేళ తనను జైలుకు పంపినా బయటకు రాగలనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు తమ టీఎంసీ పార్టీ ఆసక్తి చూపినా ఆ పార్టీ తిరస్కరించిందన్నారు.
కాగా మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆధీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment