సాక్షి, సిద్దిపేట : దుబ్బాక దంగల్‌లో అధికార టీఆర్‌ఎస్‌కు నిరాశే మిగిలింది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ... విజయం బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటరు టీఆర్‌ఎస్‌కు షాకిచ్చాడు.
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తాలూకు సానుభూతి, అధికారపార్టీకి ఉండే అనుకూలత... ఇవేవీ టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను గట్టెక్కించలేకపోయాయి. గతంలో వరుస ఓటములు చవిచూసిన రఘునందన్‌రావు ఎట్టకేలకు ప్రతిష్టాత్మక పోరులో విజయతీరాన్ని చేరారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అందరి దృష్టి దుబ్బాకపైనే కేంద్రీకృతమైంది. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. రౌండ్‌రౌండ్‌కూ ఆధిక్యం మారుతూ నరాలుతెగే ఉత్కంఠ నెలకొంది. నువ్వా..? నేనా..? అన్నట్లుగా సాగిన హోరాహోరీ పోరులో చివరి నాలుగు రౌండ్లలో అధిక్యం సాధించి బీజేపీ గెలుపొందింది.
దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు, నార్సింగి, చేగుంట మండలాల పరిధిలో ఉన్న నియోజకవర్గంలో 1,98,807 ఓట్లకు గాను.. 1,64,192 మంది ఓటర్లు నేరుగా ఓటు హక్కును వినియోగించుకోగా... పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1,453 మంది ఓటు హక్కును వినియోగించకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి భారతీ హోళికేరి ప్రకటించారు. రఘునందన్‌రావు విజయాన్ని ధృవీకరించారు. నాలుగో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 3,489 ఓట్లు రావడం గమనార్హం.
రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ
ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం 315 పోలింగ్ బూత్‌లు ఉండగా... రెండు గదుల్లో 14 టేబుల్స్‌పై ఓట్లను లెక్కించారు. మొత్తం 23 రౌండ్లు లెక్కింపు ప్రక్రియ సాగింది. మొదట దుబ్బాక రూరల్, తర్వాత దుబ్బాక మున్సిపాలిటీ, ఆపై వరుసగా మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు, నార్సింగి మండలాల ఓట్లను లెక్కించారు. చేగుంట మండలంతో కౌంటింగ్ ముగిసింది.
దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో బీజేపీ మెజారిటీతో సాధించగా.. దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ వచ్చింది. తొగుట మండలం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పుకోదగిన ఓట్లు సాధించలేదు. చివరినిమిషం వరకు నువ్వా..? నేనా..? అన్నట్లు టీఆర్‌ఎస్, బీజేపీ పోటీపడగా... చేగుంట మండలంలో బీజేపీ ఆధిక్యం చూపడంతో రఘునందన్‌రావు విజయం ఖరారైంది. రఘునందన్‌రావు విజయంతో తెలంగాణవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. కమలదళంలో ఫుల్‌జోష్ కనిపించగా.... టీఆర్‌ఎస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి.
తారుమారైన అంచనాలు
ఎన్నికల ఫలితాలపై అందరి అంచనాలు తారుమారయ్యాయి. 3వ తేదీన ఎన్నిక ముగిసిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఈ ఫలితాలపైనే చర్చ సాగింది. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి అనుకూలంగా రాగా... మరికొన్ని టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పాయి. ముందుగా 30, 40 వేల మెజార్టీతో టీఆర్‌ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ... క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులు, యువత ప్రభావం జయాపజయాలను తారుమారు చేశాయి. ఎవరునెగ్గినా సుమారు 10 వేల ఓట్లతోనేనని బెట్టింగ్‌లు కూడా కాశారు. చివరకు 1,079 ఓట్ల మెజారిటీ బీజేపీ గెలిచి అందరి అంచనాలను తారుమారు చేసింది.
ఫలించని కాంగ్రెస్ వ్యూహం
ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముఖ్య నాయకులను దుబ్బాక నియోజకవర్గంలో మోహరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగారు. దుబ్బాకలో రెండు రోజులు మకాం పెట్టి మరీ దిశానిర్దేశం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర హేమాహేమీలంతా మండలాలు, గ్రామాలను పంచుకొని ప్రచారం చేశారు. గెలుపు ఓటమిల విషయం పక్కన పెట్టినా... గత ఎన్నికల్లో వచ్చిన ఓట్‌లైనా సాధించి రెండో స్థానాన్ని పదిలపరుచుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. గత ఎన్నికల్లో 26,691 ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ దఫా 22,196 ఓట్లతో డిపాజిట్‌ను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment