Dubbaka Bypoll 2020 Results
-
పార్టీలు సహకరించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తున్నం దున అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) సి.పార్థసారథి కోరారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఫిబ్రవరి 10వ తేదీకి ముగుస్తున్నందున, ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఉందని చెప్పారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఎస్ఈసీ కార్యాలయంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వార్డుల వారీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మోడల్ కోడ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై కమిషనర్ చర్చించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులతో పార్థసారథి విడివిడిగా సమావేశమయ్యారు. వారుల్డవారీగా ఓటర్ల జాబితాలను సక్రమం గా తయారు చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని వివిధ రాజకీయపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఏ వార్డులో నివసించే ఓటర్లను ఆ వార్డు జాబితాలోనే చేర్చాలని, ఒక వార్డు ఓటరు ఇంకో వార్డులో ఉండరాదని, ఒక కుటుంబంలోని ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా కచ్చితంగా నిర్ధారించుకోవాలని ఎన్నికల అథారిటీగా ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్‌ను, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించనున్నట్లు పార్థసారథి చెప్పారు. రాజకీయపార్టీల సూచనలు... దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచార ప్రభావం ఎన్నికలపై పడినందున, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాంటిది జరగకుండా ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి నియంత్రణకు చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రతినిధులు సూచించారు. వార్డులవారీ ఓటర్ల ముసాయిదా జాబితాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, తప్పులను సవరించాలని, ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రతి నిధులు కోరారు. బీసీ రిజర్వేషన్లను పెంచడంతోపాటు పోటీకి ఇద్దరు పిల్లల సంతానం పరిమితిని ఎత్తేయాలని, అన్ని రాజకీయపార్టీలకు అడ్వర్జైజ్మెంట్లో సమాన అవకాశాలు కల్పించాలని, కొన్ని వర్గాల ఓటర్లపై ఈ–ఓటింగ్ వర్తింపజేయడం సరికాదని టీపీసీసీ నేతలు పేర్కొన్నారు. అభ్యర్థులు భారీగా మద్యం, డబ్బులు ఖర్చు చేస్తున్నందున ఈ వ్యయానికి కళ్లెం వేసేందుకు ప్రతి డివిజన్లో ప్రత్యేక పర్యవేక్షక అధికారిని నియమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సూచించారు. (సీఎంకు దుబ్బాక ప్రజల దీపావళి గిఫ్ట్) -
దుబ్బాక ఎన్నిక : హైకోర్టును ఆశ్రయించిన రఘునందన్
సాక్షి, హైదరాబాద్ : ‘సిద్దిపేట నోట్ల కట్టల లొల్లి’ ఘటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో రూ.18 లక్షలు లభించాయని కట్టు కథ అల్లారని పిటిషన్లో పేర్కొన్నారు. రఘనందన్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు రాగా, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సూచించారు. ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. (చదవండి : కేసీఆర్‌ను బలహీనపరచాలని చూస్తున్నారు) కాగా, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్టోబర్ 26న రఘునందన్‌రావు సన్నిహితుడు అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని బీజేపీ శ్రేణులు ఆరోపించగా.. ఆ డబ్బంతా రఘునందన్‌రావుదే అని టీఆర్ఎస్ ప్రచారం చేసింది. -
సంచలనంగా దుబ్బాక ఫలితం
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీస్తోంది. అధికార టీఆర్ఎస్కు షాకివ్వడమే కాక, ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రానికి సంబంధించిన అనేక సంకేతాలను వెలుగులోకి తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఎదుర్కొన్న ఈ ఎన్నికలో అంతిమ విజేత ఎవరైనా మూడు పార్టీల భవిష్యత్తును నిర్దేశించేలా దుబ్బాక ప్రజలు తీర్పునిచ్చారని, మూడు పార్టీలనూ ఆలోచనలో పడేసేలా ఫలితం వచ్చిందని రాజకీయ వర్గాలంటున్నాయి. సానుభూతి కోణంలోనే పోరాడిన మూడు పక్షాల హోరాహోరీ పోరు రాజ కీయ పక్షాలకు సవాల్ విసిరేలా, ప్రచారంలో దూకుడు, భావోద్వేగాలకు వేదికగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. టీఆర్ఎస్: అప్రమత్తం గత ఆరేళ్లుగా జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన అధికార టీఆర్ఎస్కు ఈ ఓటమి మేల్కొలుపు వంటిదని రాజకీయ వర్గాలంటున్నాయి. పాజిటివ్ స్పందన ఒక్కసారిగా నెగెటివ్‌గా మారగానే కలిగే రాజకీయ ప్రకంపనలు సహజంగానే అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తాయని, అయితే ప్రజాసంక్షేమంపై మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరాన్ని దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్కు గుర్తు చేశారన్నది విశ్లేషకుల మాట. ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ హనీమూన్ ముగిసినట్టే. ఇకపై జాగ్రత్తగా ముందుకెళ్తేనే అధికారం నిలబడుతుంది. లేదంటే ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. పార్టీలకతీతంగా ప్రశ్నించే గొంతుకలను ప్రజలు ఆదరిస్తారు’అన్న ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యలు టీఆర్ఎస్ భవిష్యత్ కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాయి. (దుబ్బాక ఫలితంపై టీఆర్ఎస్లో అంతర్మథనం) కాంగ్రెస్: ఆశ నిరాశే ఆరేళ్లుగా ఓటమి మాత్రమే తెలిసిన ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఫలితం మళ్లీ చేదుగుళికే అయ్యింది. దీర్ఘకాలంగా సంప్రదాయకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ పద్ధతి మార్చుకుని దూకుడు పెంచకపోతే రాష్ట్రంలో చిన్న ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోతుందనే సంకేతాల్ని కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికలు పంపాయనేది రాజకీయ వర్గాల భావన. జాతీయ స్థాయిలో ఉన్న మరో పార్టీ రాజకీయ క్షేత్రంలో గుర్రంలా దౌడుతీస్తోంటే ఇంకా తాబేలు–కుందేలు కథ మాదిరిగా కాంగ్రెస్ వ్యవహరిస్తే కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబ్బాకలో ఓటమి నష్టమే అయినా ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట కేడర్ ఉన్న కాంగ్రెస్‌ను సంస్థాగత మార్పులు, పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు, కీలక నేతల్లో ఐక్యత మాత్రమే కాపాడతాయని, లేదంటే దుబ్బాక ఫలితమే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. (టీఆర్ఎస్ కంచుకోటలో కమలదళం పాగా) బీజేపీ: కమల దళానికి ఊపు అనూహ్య విజయం సాధించిన బీజేపీకి ఈ ఫలితం మంచి బూస్టేనని చెప్పకతప్పదు. కేంద్రంలో ఉన్న అధికారం అండతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పక్షంగా ఎదగాలనే కమలనాథుల ఆకాంక్ష నెరవేర్చేందుకు దుబ్బాక ఎన్నిక బాటలు వేసిందని రాజకీయ వర్గాలంటున్నాయి. జాతీయ పార్టీగా రాష్ట్రంపై పట్టు సాధించాలనే ఆరాటంతో కొంత దూకుడుగానే పోతున్న బీజేపీ నేతలకు దుబ్బాక ఫలితం కిక్కునిచ్చినా ముందుంది మామూ లు పండుగేమీ కాదని, ఇంకా చాలా కష్టపడితేనే కమలనాథుల ఆశలు నెరవేరుతాయని విశ్లేషకులంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20– 30 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ మోస్తరు ఓట్లు సాధించే పరిస్థితి లేదని గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రే ఫలితాలు తారుమారుకావని, మూడుసార్లు ఓడిపోయినా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్న రఘునందన్రావులాంటి నాయకులు చాలామంది రావాలని, క్షేత్రస్థాయిలో ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని బీజేపీ నేతలు గుర్తించాలని రాజకీయ వర్గాలంటున్నాయి. -
కార్యకర్త ఆత్మహత్య.. పాడె మోసిన హరీశ్‌రావు
-
కార్యకర్త ఆత్మహత్య.. పాడె మోసిన హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి మనస్తాపం చెందిన పార్టీ కార్యకర్త స్వామి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు కొనయిపల్లికి వెళ్లి స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. అంత్యక్రియల అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని, సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. ‘టీఆర్ఎస్ కార్తకర్త మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలి. సహనం కోల్పోవద్దు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందని కాపాడుకుంటుంది. రాజకీయం లో గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి.. కానీ అనుకోని సంఘటన జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుతున్నాను. స్వామి చాలా చురుకైన కార్యకర్త, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం లో చురుకుగా పాల్గొన్నాడు. రాత్రి బవళ్లు పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్త. స్వామి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుంది. ఈ రోజు 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించాం. భవిష్యత్తు లో కూడా స్వామి కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుంది. స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఎంతో భవిష్యత్ ఉంది. ఎన్నో ఎన్నికల్లో గెలిచాం. కొన్ని సందర్భాలలో ఓటమిని కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ఎవ్వరు ఆందోళన చెందొద్దు. గెలిచినప్పుడు పొంగిపోవద్దు.. ఓడినప్పుడు కుంగిపోవద్దు. సమన్వయం ముదుకు వెళ్దాం’ అని హరీశ్‌రావు అన్నారు. -
దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు..
సాక్షి, ఖమ్మం : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవాలనే కసితో ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టీఆర్ఎస్లోకి పోతాడని బీజేపీ దుష్ర్పచారం చేసిందని, అందుకే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. బుధవారం ఆయన పొన్నాల లక్ష్మయ్యతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతితో రఘునందన్‌రావు గెలిచాడే తప్ప బీజేపీ గెలువలేదన్నారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాతుడూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంతృత్వ సాగువిధానం తీసుకురావటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కౌలు రైతులను నిండా ముంచిన ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని విమర్శించారు. భట్టి ర్యాలీకి ఘన స్వాగతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు జల్లుతూ.. డప్పులతో మోత మోగిస్తూ ఘన స్వాగతం పలికారు. మధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా చేరారు. ఒకానొక దశలో ర్యాలీ అనుకన్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలో జరుగుతున్న ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాక: టీఆర్ఎస్ ఓట్లకు భారీ గండి
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అనూహ్య విజయంతో టీఆర్ఎస్కు ఊహించని షాక్ ఎదురైంది. 2018లో టీఆర్ఎస్ నేత దివంగత సోలిపేట రామలింగారెడ్డి 54.36 శాతం ఓట్లను కైవసం చేసుకుని భారీ ఆధిక్యంతో గెలుపొందగా తాజా ఉప ఎన్నికలో పరిస్థితి తారుమారైంది. బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరు సాగినా టీఆర్ఎస్కు గత ఎన్నికల్లో పోలయిన ఓట్లలో భారీ గండిపడింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 38.4 శాతం ఓట్లు రాగా, సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి సోలిపేట సుజాతకు 37.8 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 13.4 శాతం ఓట్లు దక్కాయి. 2018లో మొత్తం చెల్లుబాటయిన ఓట్లలో విజేత, పరాజితకు మధ్య 38.2 శాతం వ్యత్యాసం ఉండగా, తాజాగా ఓట్ల వ్యత్యాసం కేవలం 0.65 శాతం ఉండటం ఉత్కంఠ పోరు ఏస్ధాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఏకంగా 62,500 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. 2014, 2018 ఎన్నికల నుంచి రఘునందన్‌రావు ఓట్ల శాతం గణనీయంగా పెరగ్గా, గత రెండు ఎన్నికల్లోనూ 50 శాతంపైగా ఓట్లను దక్కించుకున్న టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో 37 శాతానికి పడిపోవడంతో ఓటమి ఎదురైంది. భర్త మరణంతో బరిలోకి దిగిన సోలిపేట సుజాతకు సానుభూతి కలిసివస్తుందని ఆశించినా, నియోజకవర్గంలో మంచి సంబంధాలు కలిగి, యువ ఓటర్లు అండగా నిలవడంతో రఘునందన్‌రావును విజయం వరించింది. చదవండి : గందళగోళంలో కాంగ్రెస్ -
దుబ్బాకలో కమలం
-
టీఆర్ఎస్ కంచుకోటలో కమలదళం పాగా
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని, అధికారంలోకి వచ్చి తీరుతామనే ఆ పార్టీ నేతల ఆశలకు బీజం వేసింది. ఓ వ్యూహం ప్రకారం బలమైన అభ్యర్థిని రంగంలోకి దించిన బీజేపీ... అధికార టీఆర్ఎస్ను కంగు తినిపించి రాష్ట్ర రాజకీయాల్లో తన గ్రాఫ్‌ను పెంచుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ఈ విజయం మంచి బూస్ట్ ఇస్తుందని, ఇదే దూకుడు కొనసాగిస్తే రాష్ట్రంలో బీజేపీ పుంజుకొనే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా దుబ్బాక ఫలితం ఇచ్చిన కిక్కుతో రాష్ట్రవ్యాప్తంగా ఇదే హవా కొనసాగిస్తామని, త్వరలో జరిగే జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యువ మంత్రం.. సోషల్ మీడియా తంత్రం దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనుకూల ఫలితం వచ్చేం దుకు ముఖ్యంగా రెండు కారణాలున్నాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజాదరణ, సానుభూతి ఉన్న బలమైన నాయకుడు రఘునందన్‌రావు అభ్యర్థిత్వంతోపాటు ప్రచారపర్వంలో ప్రదర్శించిన దూకుడు ఈ విజయానికి తోడ్పడ్డాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకోగలిగామని, ఈ యువ మంత్రమే టీఆర్ఎస్ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూర్చిన కుటుంబాల ఓట్ల ను కూడా తమ వైపునకు తిప్పిందని అంటున్నారు. ‘35 ఏళ్లలోపు యువత, నిరుద్యోగులు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారంతా రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని సమర్థించి కేంద్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని చూపారు. (గులాబీ తోటలో కమల వికాసం) భవిష్యత్తులో అధికారం చేజిక్కించుకొనే దిశగా మా ప్రయాణానికి సులువైన మార్గాన్ని వేసిన ఫలితం’అని రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. యువతతోపాటు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కూడా కలసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీని అడ్డుకొనేందుకు అధికార పార్టీ వ్యవహరించిన తీరు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్‌రావు బంధువులపై దాడులు జరిగిన తీరును సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాయని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమ వైపునకు మళ్లేందుకు కారణమైందని చెబుతున్నారు. (విలేకరి నుంచి ఎమ్మెల్యే వరకు.. ) భవిష్యత్తు మాదే దుబ్బాక ఫలితం పదేపదే పునరావృతం అవుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తామని, బల్దియా కోటను చేజిక్కించుకుంటామని చెబుతున్నారు. ఆ తర్వాత జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగుతుందని, ఫలితంగా ప్రత్యామ్నాయ శక్తిగా పుంజుకోవడం ఖాయ మని అంటున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని తక్కువ అంచనా వేయవద్దనే సంకేతాలను దుబ్బాక ఫలితం పంపిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును అనువుగా మలచుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. -
కారును దెబ్బతీసిన రోటీ మేకర్
సిద్దిపేటజోన్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన రోటీ మేకర్ (చపాతీ పీట, అప్పడాల కర్ర) గుర్తు స్వతంత్ర అభ్యర్థికి అనూహ్యంగా ఓట్లు తెచ్చిపెట్టింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బండారి నాగరాజుకు రోటీమేకర్ గుర్తురాగా, ఆయనకు 3,570 ఓట్లు పోల్ అయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌గూడేనికి చెందిన నాగరాజు దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో ఉండడంతో పోలింగ్ రోజు రెండు ఈవీఎంలను వినియోగించారు. మొదటి ఈవీఎంలో 3వ నంబర్లో టీఆర్ఎస్ అభ్యర్థి (కారు గుర్తు) ఉండగా, రెండో ఈవీఎంలో అచ్చంగా కారును పోలిన రోటీ మేకర్ గుర్తు కూడా పైన ఉండటం ఓటర్లను అయోమయానికి గురిచేసింది. చాలామంది కారు గుర్తుగా పొరపడి రెండో ఈవీఎంలోని రోటీ మేకర్‌పై ఓటు వేయడంతో స్వతంత్ర అభ్యర్థి నాగరాజుకు 3,570 ఓట్లు వచ్చి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మూడు సార్లు ఓడినా.. పట్టు వదల్లేదు..
సాక్షి, సిద్దిపేట : పత్రికా విలేకరి నుంచి ఉద్యమకారుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మాధవనేని రఘునందన్‌రావు తాజాగా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విలేకరుల స్థాయి నుంచి పలువురు రాజకీయ నాయకులుగా ఎదిగిన చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సత్యనారాయణ ఎమ్మెల్సీగా, దుబ్బాక నుంచి దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రాంతికిరణ్ పాత్రికేయ వృత్తి నుంచి వచ్చిన వారే. అదే కోవలో రఘునందన్‌రావు సైతం చేరారు. సోలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఆయన మరణం తర్వాత మరోసారి ఒక జర్నలిస్టుగా పనిచేసిన రఘునందన్‌రావు గెలుచుకోవడం విశేషం. (గులాబీ తోటలో కమల వికాసం) రాజకీయాలపై ఆసక్తితో... దుబ్బాక మండలం బొప్పాపూర్‌కు చెందిన భగవంతరావు, భారతమ్మ దంపతులకు రఘునందన్‌రావు 1968 మార్చి 23న సిద్దిపేటలో జన్మించారు. డిగ్రీ (బీఎస్సీ) వరకు సిద్దిపేటలోనే చదువుకున్న ఆయన.. ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పొందా రు. అనంతరం 1991లో తన మకాంను పటాన్‌చెరుకు మార్చారు. అప్పటి నుంచి దాదాపు ఐదేళ్లపాటు ఓ తెలుగు దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూనే రాజకీయాలపై ఆసక్తితో 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో అందులో చేరారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013లో టీఆర్ఎస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీలో చేరి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దుబ్బాక, మెదక్ స్థానాల నుంచి పోటీ చేశారు. మూడుసార్లు ఓటమిపాలైనా పట్టువీడకుండా సోలిపేట మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. చివరిశ్వాస వరకు ప్రజలతోనే... తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన గెలుపు చరిత్రాత్మకమని, టీఆర్ఎస్కు గుణపాఠమని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌కు వినపడేలా దుబ్బాక ప్రజలు తీర్పు ఇచ్చారని, ముఖ్యమంత్రికి విద్య నేర్పిన దుబ్బాకే, ఉప ఎన్నిక ద్వారా మళ్లీ విద్య నేర్పిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక కారణంగా అనేక మందిపై అక్రమ, నిర్బంధ కేసులు పెట్టారని, వారందరినీ సంగారెడ్డి జైలుకు తరలించడం, వారు ఈ విజయోత్సవంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఈ అరాచక, అప్రజాస్వామ్య, నియంత్రిత్వంపై పోరాటం చేస్తామన్నారు. తన విజయానికి సహకరించిన సిద్దిపేట సీపీ, హైదరాబాద్ సీపీలకు కృతజ్ఞతలతోపాటు తన గెలుపును సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌కు అంకితం ఇస్తున్నట్లు రఘునందన్‌రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తన గెలుపును ఆకాంక్షించారన్నారు. తన గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా నిలిచారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. -
గులాబీ తోటలో కమల వికాసం
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక దంగల్‌లో అధికార టీఆర్ఎస్కు నిరాశే మిగిలింది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ... విజయం బీజేపీ, టీఆర్ఎస్లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటరు టీఆర్ఎస్కు షాకిచ్చాడు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తాలూకు సానుభూతి, అధికారపార్టీకి ఉండే అనుకూలత... ఇవేవీ టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను గట్టెక్కించలేకపోయాయి. గతంలో వరుస ఓటములు చవిచూసిన రఘునందన్‌రావు ఎట్టకేలకు ప్రతిష్టాత్మక పోరులో విజయతీరాన్ని చేరారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అందరి దృష్టి దుబ్బాకపైనే కేంద్రీకృతమైంది. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. రౌండ్‌రౌండ్‌కూ ఆధిక్యం మారుతూ నరాలుతెగే ఉత్కంఠ నెలకొంది. నువ్వా..? నేనా..? అన్నట్లుగా సాగిన హోరాహోరీ పోరులో చివరి నాలుగు రౌండ్లలో అధిక్యం సాధించి బీజేపీ గెలుపొందింది. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు, నార్సింగి, చేగుంట మండలాల పరిధిలో ఉన్న నియోజకవర్గంలో 1,98,807 ఓట్లకు గాను.. 1,64,192 మంది ఓటర్లు నేరుగా ఓటు హక్కును వినియోగించుకోగా... పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1,453 మంది ఓటు హక్కును వినియోగించకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి భారతీ హోళికేరి ప్రకటించారు. రఘునందన్‌రావు విజయాన్ని ధృవీకరించారు. నాలుగో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 3,489 ఓట్లు రావడం గమనార్హం. రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం 315 పోలింగ్ బూత్‌లు ఉండగా... రెండు గదుల్లో 14 టేబుల్స్‌పై ఓట్లను లెక్కించారు. మొత్తం 23 రౌండ్లు లెక్కింపు ప్రక్రియ సాగింది. మొదట దుబ్బాక రూరల్, తర్వాత దుబ్బాక మున్సిపాలిటీ, ఆపై వరుసగా మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు, నార్సింగి మండలాల ఓట్లను లెక్కించారు. చేగుంట మండలంతో కౌంటింగ్ ముగిసింది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో బీజేపీ మెజారిటీతో సాధించగా.. దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో టీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది. తొగుట మండలం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పుకోదగిన ఓట్లు సాధించలేదు. చివరినిమిషం వరకు నువ్వా..? నేనా..? అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ పోటీపడగా... చేగుంట మండలంలో బీజేపీ ఆధిక్యం చూపడంతో రఘునందన్‌రావు విజయం ఖరారైంది. రఘునందన్‌రావు విజయంతో తెలంగాణవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. కమలదళంలో ఫుల్‌జోష్ కనిపించగా.... టీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. తారుమారైన అంచనాలు ఎన్నికల ఫలితాలపై అందరి అంచనాలు తారుమారయ్యాయి. 3వ తేదీన ఎన్నిక ముగిసిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఈ ఫలితాలపైనే చర్చ సాగింది. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి అనుకూలంగా రాగా... మరికొన్ని టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. ముందుగా 30, 40 వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ... క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులు, యువత ప్రభావం జయాపజయాలను తారుమారు చేశాయి. ఎవరునెగ్గినా సుమారు 10 వేల ఓట్లతోనేనని బెట్టింగ్‌లు కూడా కాశారు. చివరకు 1,079 ఓట్ల మెజారిటీ బీజేపీ గెలిచి అందరి అంచనాలను తారుమారు చేసింది. ఫలించని కాంగ్రెస్ వ్యూహం ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముఖ్య నాయకులను దుబ్బాక నియోజకవర్గంలో మోహరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగారు. దుబ్బాకలో రెండు రోజులు మకాం పెట్టి మరీ దిశానిర్దేశం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర హేమాహేమీలంతా మండలాలు, గ్రామాలను పంచుకొని ప్రచారం చేశారు. గెలుపు ఓటమిల విషయం పక్కన పెట్టినా... గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లైనా సాధించి రెండో స్థానాన్ని పదిలపరుచుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. గత ఎన్నికల్లో 26,691 ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ దఫా 22,196 ఓట్లతో డిపాజిట్‌ను కోల్పోయింది. -
‘దుబ్బాక గెలుపు బీజేపీది కాదు రఘునందన్‌దే’
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉపఎన్నికలో ప్రజల ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అహంకారానికి చరమగీతమని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాదాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితం పై గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్- బీజేపీ లోపాయకారి ఒప్పందం జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. ‘దుబ్బాక ఫలితం కాంగ్రెస్ పార్టీని నిరాశ పరిచినప్పటికీ కూడా ఈ ఉపఎన్నిక ఓ గుణాత్మక మార్పుకు నాంది పలికింది. రాజకీయ మాయలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు కానీ రానున్న ధర్మ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. ప్రజలు కోరుకున్న సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. దుబ్బాక ఫలితాలని లోతుగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెంపపెట్టు. ఆధిపత్య అహంకారంతో నిరంకుశంతో పోలీసులని, రెవెన్యు శాఖని, డబ్బుని అడ్డం పెట్టుకొని, అధికార మదంతో విర్రవీగుతున్న కేసీఆర్ కి కర్రకాల్చి వాత పెట్ట్టినట్లుగా దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారు. తన ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ కుక్కపై వున్న ప్రేమ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ ప్రజలపై లేదు. వరద బురదలో అష్టకష్టాలు పడినవారి మీద లేదు. ఇలాంటి అహంకారి కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. తమ ఓటుతో కేసీఆర్ అహంకారం దించారు. నిజాం నవాబ్ అప్పట్లో శిస్తులు వసూలు చేసి ప్రజల రక్తం తాగితే ఈ రోజు కేసీఆర్ ఎల్ ఆర్ఎస్ పేరుతో ప్రజల రక్తం తాగే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి : దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) నిర్బంధ వ్యవసాయమని ప్రజలని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మల్లన్న సాగర్ దగ్గర రైతుల భూములు దౌర్జన్యంగా గుంజుకున్న కేసీఆర్ కు ఆ రైతుల ఉసురు తగిలింది. కేసీఆర్ ఇకపై తన అహంకారాన్ని వీడి భూమిపైకి రావాలి. ప్రజల ఆలోచనకు అనుగుణంగా పని చేయాలి. పధకాలని ఎర వేసి ఓట్లు పట్టుకోవాలనే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనకు కూడా దుబ్బాక ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. సిద్ధిపేట, గజ్వేల్ లకు మాత్రమే వేల కోట్ల రూపాయిలు కేటాయించి దుబ్బాకని గాలికి వదిలేసిన కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఈ ఫలితం కేసీఆర్, హరీష్ రావు కు చెంపదెబ్బ. దుబ్బాక ప్రజలు కసితో టీఆర్ఎస్ ప్రజలు ఓడించారు. కేసీఆర్ ఇకనైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, ప్రజలు కోరుకున్న రీతిలో పరిపాలన చేయాలని' సూచించారు (చదవండి : దుబ్బాక ఫలితాలపై రాములమ్మ స్పందన) టీఆర్ఎస్- బీజేపీ కుట్ర కోణం వాస్తవానికి దుబ్బాక నియోజిక వర్గం కాంగ్రెస్ పోర్ట్ కాదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన నియోజిక వర్గం కాదు. అయినప్పటికీ గతంలో పార్లమెంట్ లో 20వేల ఓట్లు వస్తే ఈ ఎన్నికలో 22 వేల ఓట్లు వచ్చాయి. రెండు వేల ఓట్లు పెరిగాయి. దీనిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ ఇక్కడ ఓటర్లు కానీ మీడియా మిత్రులు కానీ అర్ధం చేసుకోవాల్సిన ఓ విషయం వుంది. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షేర్ అయాయ్యి. ఇందులో ఆ రెండు పార్టీల కుట్ర కోణం ఉందనే అనుమానాలు వున్నాయి. రఘునందన్ రావు ప్రచారం మొదలుపెట్టినపుడు ఏమంత ప్రాభల్యం కనబరచలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వుందనే వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణం నుండి ప్రజల ద్రుష్టిని మళ్లించేదుకు, రఘునందన్ రావుకి ప్రాభల్యం పెంచేటందుకు, కుట్ర కోణంలో ఆయన కార్లు ఆపడం, కార్ల టైర్లు కోయడం , టీఆర్ ఎస్ పార్టీని కొమ్ము కాస్తున్న మీడియా వర్గాలు , టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున దాన్ని చూపించడం, తర్వాత రఘునందన్ రావు మామ ఇంట్లో కి వెళ్లి డబ్బులు వున్నాయని దాడి చేయడం , దాన్ని మీడియాలో హైలెట్ చేసి చూపించడం .. ఇవన్నీ చూస్తుంటే రఘునందన్ రావు కి సానుభూతి పెంచడానికి టీఆర్ఎస్ పార్టీ ఏదైనా కుట్ర చేసిందా ? టీఆర్ఎస్ కి బీజేపీ లోపాయకారి ఒప్పందం ఉందా ?’అని దాసోజు శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. ‘టీఆర్ఎస్ తన చర్యల ద్వారా రఘునందన్ కు సానుభూతి వచ్చేలా చేసింది. అందుకే ఈ విజయాన్ని బీజేపీ విజయం కాకుండా రఘునందన్ కు సానుభూతి వలన వచ్చిన విజయంగానే తాము భావిస్తున్నాం. ఇక్కడ మరో విషయం వుంది. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష రావు ఇమేజ్ ని తగ్గించేందుకు కుట్ర జరిగిందా? అనే కోణం కూడా ఉంది. అయితే ఈ ఫలితంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఓటమి నిరాశ కలిగిస్తుంది. అయితే ఓటమే విజయానికి సోపానం. మేము యుద్దం చేసి ఓడిపోయాం’ అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. -
దుబ్బాక విజయంతో బీజేపీ సంబరాలు
-
దుబ్బాక ఫలితాలపై రాములమ్మ స్పందన
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారని అన్నారు. దుబ్బాక ఫలితాలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. (చదవండి : విజయం చారిత్రాత్మకం: రఘునందన్ ) ‘ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆర్ఎస్ అంటోంది. అయితే, ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. దుబ్బాకలో టీఆర్ఎస్కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని... బీజేపీ, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి.... ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి... ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండి. ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండి. ఏది ఏమైనా దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజపు రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు’ అని విజయశాంతి అన్నారు. (చదవండి : దుబ్బాక ఫలితం మమ్మల్ని అప్రమత్తం చేసింది: కేటీఆర్) -
తీర్పు చారిత్రాత్మకం : రఘునందన్
సాక్షి, సిద్దిపేట : ఉత్కంఠ బరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల పోరులో బీజేపీ అభ్యర్థ రఘునందన్‌రావు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్పై అనుహ్య రీతిలో గెలుపొంది.. గులాబీ దళానికి సవాలు విసురుతున్నారు. రానున్న ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితమే పునరావృత్తం అవుతుందని గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు సృష్టించినా.. దుబ్బాకలో కాషాయ జెండా ఎగరేశామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (తొలిదెబ్బ.. ఫలించని హరీష్ ఎత్తుగడలు) ఇక ఈ ఫలితాలు ఎంతో చారిత్రాత్మకమైనవని విజేత రఘునందన్‌రావు అన్నారు. తనకు విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు. ఫలితాల అనంతరం సిద్దిపేటలో ఇందూరు కాలేజీ వద్ద రఘునందన్‌రావు సాక్షితో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తన గెలుపును అడ్డుకోవాడానికి టీఆర్ఎస్ నేతలు అన్ని విధాల ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అసెంబ్లీ వేదికగా వారి తీరును ఎండగడతానని అన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకుంటూ పోరాటం సాగిస్తామన్నారు. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) ‘దుబ్బాక ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్సులు తెలుపుతున్నా . ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం . ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంచించామో గొంతె త్తామో అదే గడ్డ ఇచ్చిన తీర్పు ప్రగతి భవన్ వరకూ పోవాలి. రాష్ట్రంలో నిరంకుశ నియంత్రుత్వ పాలనకు చరమ గీతం పాడేలా రీ సౌండ్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్‌కు ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన నాయకుల్లా రా కలిసి రండి. ఏకమై పోరాడుదాం’ అని వ్యాఖ్యానించారు. -
‘అడుగడుగనా ఇబ్బందులకు గురిచేశారు’
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి అధికార పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విజయాన్ని తమ విజయంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారులు పక్షపాతంగా వ్యకహరించారని ఆరోపించారు. బీజేపీ నేతలు ప్రచారానికి వెళ్తే గంటల తరబడి రోడ్లపై నిలబెట్టారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన శాశ్వతం కాదని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ది చెబుతారనేదానికి దుబ్బాక ఫలితాలే నిదర్శనం అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకున్న దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చూపిస్తామన్నారు. (చదవండి : దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్ ) కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. -
దుబ్బాకలో ఓటమి.. హరీష్ రావు స్పందన
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో ప్రజా తీర్పును శిరసా వహిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ఎన్నిక ఓటమికి తానే బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 1079 ఓట్ల తేడాతో ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని, లోపాలను సరిచేసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి: దుబ్బాక ఫలితం మమ్మల్ని అప్రమత్తం చేసింది: కేటీఆర్) అదే విధంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు, ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఓటమి పాలైనప్పటికీ నిరంతం ప్రజాసేవకే అంకితమవుతామని, ప్రజలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హరీష్‌రావు హామీ ఇచ్చారు. కాగా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న జరిగిన ఈ ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ, టీఆర్ఎస్ కంచుకోట అయిన సిద్ధిపేట జిల్లాలో కాషాయ జెండా ఎగురవేసి భారీ షాకిచ్చింది. -
దుబ్బాక గెలుపు అతనికే అంకితం : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. 23 రౌండ్లకు గాను 12 రౌండ్లల్లో బీజేపీ అధిక్యం సాధించింది. ఉత్కంఠ పోరులో విజయం సాంధించిన రఘునందన్‌కు అభినందనలు వెల్లువెత్తువెత్తున్నాయి. (చదవండి : దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్ ) దుబ్బాక గెలుపును ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన కార్యకర్త గంగుల శ్రీనివాస్‌కు అంకితం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇందుకు ఉదాహరణ దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే అని ఆమె అన్నారు. ఈ గెలుపు తెలంగాణ మొత్తం ప్రభావం చూపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ గెలుపు దోహపడుతుందన్నారు. ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని, అభ్యర్థి గెలుపును, పార్టీ గెలుపును విడదీయలేమని కిషన్‌రెడ్డి అన్నారు. (చదవండి : దుబ్బాకలో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ) -
దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీని మరింత అప్రమత్తం చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితాలు తాము ఆశించినట్లు రాలేదని, ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటామని తెలిపారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..దుబ్బాక ఫలితాలు తమ పార్టీ కార్యకర్తలను మరింత అప్రమత్తం అయ్యేలా చేశాయని, త్వరలోనే ఫలితాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. (చదవండి : దుబ్బాకలో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ) ‘2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించింది. మేము విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము. మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పాటు పడిన కార్యకర్తలు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు. ఫలితాలు మేము ఆశించిన విధంగా రాలేదు. ఈ ఫలితాలు మా పార్టీ అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతంది. ఫలితాలు ఆశించిన విధంగా ఎందుకు రాలేదో, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకొని పార్టీ అధ్యక్షుడిని నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. -
ఓటమిపై లోతుగా సమీక్షించుకుంటాం: కేటీఆర్
-
దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం
సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1079 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. ఆధిక్యం నుంచి ఓటమికి.. ఓ సమయంలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. 19వ రౌండ్ ముగిసే సరికి అధికార టీఆర్ఎస్ 450 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో దాదాపు విజయం ఖాయమనుకున్నారు. అయితే వరుసగా 20, 21, 22, 23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 241 ఓట్ల ఆధిక్యం, 21వ రౌండ్లో 428 ఓట్ల, 22వ రౌండ్లో 438 ఓట్ల ఆధిక్యంతో పాటు 23వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం లభించడంతో 1,079 ఓట్ల మెజార్టీతో రఘునందన్ విజయం సాధించారు. దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 62,773 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కేవలం 21,819 ఓట్లకే పరిమితం అయ్యారు. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బండి సంజయ్ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దుబ్బాక ఫలితం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ షాకింగ్‌కు గురిచేసింది. ప్రచారంలో మంత్రి హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించినప్పటికీ.. ఓటర్లు రఘునందన్‌వైపే మొగ్గుచూపారు. లక్ష మెజార్టీ వస్తుందని హరీష్ అంచనా వేసినప్పటికీ.. బీజేపీ ధాటికి పరాజయం పాలవ్వక తప్పలేదు. -
టీఆర్ఎస్ ఆధిక్యం
-
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ఫోటోలు
-
నేడు దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
-
టీఆర్ఎస్కు ‘మెజారిటీ’ గుబులు!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని అధికార టీఆర్ఎస్ గట్టిగా చెబుతున్నా మెజారిటీ విషయంలో మాత్రం ఆ పార్టీ గుబులు చెందుతోంది. ఎన్నికల ప్రక్రియ మొదట్లో మెజారిటీ పెంచుకోవడంపైనే దృష్టి సారించిన టీఆర్ఎస్... ఇప్పుడు గెలిస్తే చాలు అన్న స్థాయిలో ఉంది. కనీసం 25 వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నా పోలింగ్ తరువాత వెలువడుతున్న అంచనాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందన్న అంచనాలను కూడా టీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి మూడో వారంలో జరుగుతాయనే సంకేతాలు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో దుబ్బాక ఫలితం కమలదళానికి ఆయుధంగా మారకూడదనే అభిప్రాయం టీఆర్ఎస్లో కనిపిస్తోంది. 90 వేల ఓట్లపై ధీమా... ఈ నెల 3న దుబ్బాక ఉప ఎన్నిక ముగిశాక పోలింగ్ సరళితోపాటు తమకు పోలయ్యే ఓట్లపై టీఆర్ఎస్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. 1.64 లక్షల ఓట్లు పోలవగా సుమారు 90 వేల ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి సాధిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా సుమారు 74 వేల ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు సాధించే ఓట్ల సంఖ్యపైనే మెజారిటీ ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ హడావుడి చేసినా దుబ్బాక నియోజకవర్గంలో ఆ పార్టీకి ఓటింగ్ అదే స్థాయిలో జరగలేదని క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకుగాను 2 లేదా 3 మండలాల పరిధిలోనే బీజేపీ కొంతమేర ప్రభావం చూపిందనే ప్రాథమిక అంచనాకు టీఆర్ఎస్ వచ్చింది. భారీ మెజారిటీ పరిస్థితి నుంచి... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాక నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై సోలిపేట రామలింగారెడ్డి 62,500పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014, 2018లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. రఘునందన్‌రావు మూడో స్థానంలో నిలిచి డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో మాత్రం ఆయన తీవ్ర పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో క్షేత్రస్థాయి అంతర్గత విభేదాలు, పార్టీ అభ్యర్థి విద్యార్హత, ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో అసంతృప్తి వంటి కారణాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దుబ్బాకలోనే మకాం వేయడంతో పోటాపోటీ ప్రచారం జరిగింది. ఈ పరిణామం తమ అనుకూల ఓటింగ్‌కు దారితీసినట్లు బీజేపీ అంచనా వేస్తోంది. జీహెచ్ఎంసీలో పునరావృతం కాకుండా... రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర నిధుల విషయంలో దుబ్బాకలో బీజేపీ చేసిన ప్రచారం జీహెచ్ఎంసీలో పునరావృతం కాకుండా చూడాలనే అభిప్రాయం టీఆర్ఎస్లో కనిపిస్తోంది. దుబ్బాకలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగితే జీహెచ్ఎంసీపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్న టీఆర్ఎస్... వీలైనంత మేర ఆ పార్టీకి అడ్డుకట్ట వేసే వ్యూహాలకు పదును పెడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో బలమైన బీజేపీ నేతలను పార్టీలోకి ఆకర్షించాలనే వ్యూహంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జితోపాటు పలువురు డివిజన్ స్థాయి నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీలో డివిజన్లవారీగా ఇప్పటికే పార్టీ బలం అంచనాకు వచ్చిన టీఆర్ఎస్... విపక్ష పార్టీల పరిస్థితిని కూడా అంచనా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నగర శివార్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచనలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మాకు ప్రజల మద్దతు పెరుగుతోంది: కె. లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. వరద బాధితులను ఆదుకునేం దుకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయిం చిందని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతున్న కారణంగా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకే మంత్రి కేటీఆర్ తమపై ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో టీఆర్ఎస్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని, త్వరలో హైదరాబాద్‌లో ‘బడుగుల సభ’ ఏర్పాటు చేసి టీఆర్ఎస్– ఎంఐఎం నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వరద సాయం పేరుతో ప్రభుత్వ ధనాన్ని టీఆర్ఎస్ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం: హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. -
దుబ్బాక కౌంటింగ్: రౌండ్లవారీగా ఫలితాలు
దుబ్బాక ‘కమలా’నిదే నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. దీంతో కాషాయ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పలేదు. విజయానికి అడుగుదూరంలో బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీ20 మ్యాచ్ ఫైనల్ పోరులో సూపర్ ఓవర్‌ను తలపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరాగా సాగుతున్న పోరులో కమలమే పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. కాగా 22వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం(438) కొనసాగిస్తోంది. ఇంకా ఒక్క రౌండ్ ఫలితం మాత్రమే మిగిలి ఉంది. 23వ రౌండ్లోనూ కాషాయ పార్టీ జోరు ఇలాగే కొనసాగితే రఘునందన్ రావు విజయం లాంఛనమే కానుంది. 22 రౌండ్లు ముగిసేసరికి ఆయన 1058 ఓట్ల మెజారిటీ సాధించారు. కమల వికాసం 21వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తోంది. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్న వేళ బీజేపీ మొత్తంగా 621 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. నరాలు తెగే ఉత్కంఠ కారు జోరు కొనసాగుతున్న వేళ అనూహ్యంగా 20వ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు వచ్చింది. 100 ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే 20వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 491 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో మరో 3 రౌండ్ల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చేగుంట, నార్సింగి మండలాల ఫలితంపై ప్రభావం చూపనున్నాయి. దూసుకుపోతున్న కారు 19 రౌండ్లోనూ గులాబి పార్టీ జోరు కొనసాగుతోంది. ఈ రౌండు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 425 ఓట్ల మెజారిటీ సాధించింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 2760, బీజేపీకి 2335, కాంగ్రెస్‌కు 976 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లోనూ ‘గులాబీ’ గుభాలింపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తోంది. 18వ రౌండ్లోనూ 688 ఓట్ల మెజారిటీ సాధించింది. 18 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 172 ఓట్లకు తగ్గింది. మిగిలి ఉన్న మరో 5 రౌండ్ల ఫలితాలు కీలకం కానున్నాయి. చేగుంట, నార్సింగి మండలాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆగని కారు జోరు 17వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్ 800 ఓట్ల మెజారిటీ సాధించింది. 17 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 934 ఓట్లకు తగ్గింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 2818, బీజేపీకి 1946, కాంగ్రెస్‌కు 1705 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్ఎస్ హవా టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. 16వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 750 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3157, బీజేపీకి 2408, కాంగ్రెస్‌కు 674 ఓట్లు దక్కాయి. కొనసాగుతున్న టీఆర్ఎస్ జోరు 15వ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 955 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్ 3027, బీజేపీ 2072, కాంగ్రెస్ పార్టీ 1500 ఓట్లు తెచ్చుకున్నాయి. 15వ రౌండ్ ముగిసే సరికి 2483 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం బీజేపీ 41514, టీఆర్ఎస్ 38,076, కాంగ్రెస్ 12658 ఓట్లు సాధించాయి. 14వ రౌండ్లోనూ కారు హవా 14వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్ 288 ఓట్ల మెజారిటీ దక్కించుకుంది. టీఆర్ఎస్కు 2537, బీజేపీకు 2249, కాంగ్రెస్ పార్టీకి 784 ఓట్లు వచ్చాయి. 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్లో టీఆర్ఎస్ జోరు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 13, 14 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 13వ రౌండ్లో టీఆర్ఎస్కు 304 ఓట్ల ఆధిక్యం దక్కింది. 13వ రౌండ్లో టీఆర్ఎస్ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్ 1212 ఓట్లు దక్కించుకున్నాయి. ►12వ రౌండ్లో అనూహ్యంగా కాంగ్రెస్ 83 ఓట్ల ఆధిక్యత సాధించింది. 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 4,030 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 11వ రౌండ్లో బీజేపీ 1997.. టీఆర్ఎస్ 1900.. కాంగ్రెస్ 2,080 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 36,745.. టీఆర్ఎస్ 32,715.. కాంగ్రెస్ 10,662 ఓట్లు సాధించింది. ఇంకా 11 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ►11వ రౌండ్లో బీజేపీ 199 ఓట్ల స్వల్ప ఆధిక్యత సాధించింది. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3,911 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 11వ రౌండ్లో బీజేపీ 2965.. టీఆర్ఎస్ 2,766.. కాంగ్రెస్ 1883 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 34,748.. టీఆర్ఎస్ 30,815.. కాంగ్రెస్ 8,582 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 12 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ►ఇప్పటిదాకా 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తికాగా.. 6,7,10 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని సాధించగా.. మిగిలిన అన్నింటిలోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. ►10వ రౌండ్లో టీఆర్ఎస్ 456 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3,734 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 10వ రౌండ్లో బీజేపీ 2,492.. టీఆర్ఎస్ 2,948.. కాంగ్రెస్ 899 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 31,783.. టీఆర్ఎస్ 28,049.. కాంగ్రెస్ 6,699 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 13 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ►తొమ్మిదో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. 9 రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 4,190 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 9వ రౌండ్లో బీజేపీ 3,143.. టీఆర్ఎస్ 2,329.. కాంగ్రెస్ 675 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 29,291.. టీఆర్ఎస్ 25,101.. కాంగ్రెస్ 5,800 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 14 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ►ఇప్పటివరకు దుబ్బాక కౌంటింగ్ 8 రౌండ్లు పూర్తికాగా.. 6 రౌండ్లలో బీజేపీ, రెండు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించాయి. మొత్తంగా బీజేపీ 25,878.. టీఆర్ఎస్ 22,722.. కాంగ్రెస్ 5,125 ఓట్లు సాధించాయి. ►పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ 1,008.. బీజేపీ 492 సాధించాయి. ►8వ రౌండ్లో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్లో బీజేపీ 3,116 టీఆర్ఎస్ 2,495.. కాంగ్రెస్ 1,122 ఓట్లు సాధించాయి. ► ఏడో రౌండ్లో టీఆర్ఎస్ 182 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఏడురౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా బీజేపీ 22,762.. టీఆర్ఎస్ 20,277.. కాంగ్రెస్ 4,003 ఓట్లు సాధించాయి. ఇప్పటివరకూ.. 52,055 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ►రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్ఎస్కు 846 ఓట్ల ఆధిక్యం లభించింది. ►దుబ్బాక ఉపఎన్నికలో మొత్తం 1,64,192 ఓట్లు పోలవ్వగా.. ఇప్పటిదాకా 45,175 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ►ఆరో రౌండ్లో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,667 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 20,226.. టీఆర్ఎస్ 17,559.. కాంగ్రెస్ 3,254 ఓట్లు సాధించాయి. ►వరుసగా ఐదో రౌండ్లోనూ బీజేపీ 336 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఐదో రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 3,020 ఓట్ల లీడ్‌లో ఉంది. ఇప్పటివరకు బీజేపీ 16,507.. టీఆర్ఎస్ 10,497.. కాంగ్రెస్ 2,724 ఓట్లు సాధించాయి. ►దుబ్బాక నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. 4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,684ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇంకా 19 రౌండ్ల ఫలితాలు తేలాల్సి ఉంది. నాలుగో రౌండ్లో బీజేపీ 3,832.. టీఆర్ఎస్ 2,407.. కాంగ్రెస్ 227 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 13,055, టీఆర్ఎస్ 10,371 కాంగ్రెస్ 2,158 ఓట్లు సాధించాయి. ►నాలుగో రౌండ్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ నాలుగో రౌండ్లో 1,425 ఓట్లు ఆధిక్యత సాధించారు. ►ప్రారంభమైన మిర్దొడ్డి మండల కౌంటింగ్ ►ముగిసిన దుబ్బాక మండల కౌంటింగ్ ►ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యం సాధించింది. ► దుబ్బాక ఉపఎన్నిక మూడో రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు 1,259 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటిదాకా బీజేపీకి 9,224.. టీఆర్ఎస్కి 7,964.. కాంగ్రెస్‌కి 1,931 ఓట్లు లభించాయి. దుబ్బాక తొలి ఫలితాలపై రాంమాధవ్ ట్వీట్ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు రాంమాధవ్ ట్వీట్ చేశారు. తమ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉందని, బీజేపీ అనూహ్య విజయం సాధించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. An interesting fight in Telangana between BJP n TRS in Dubbaka Assembly by poll. BJP is currently leading. This could be a surprise victory for BJP — Ram Madhav (@rammadhavbjp) November 10, 2020 ► దుబ్బాక ఉపఎన్నిక రెండో రౌండ్లో బీజేపీ 279 ఓట్ల ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్లో బీజేపీకి 1,561 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1,282 ఓట్లు లభించాయి. మొదటి రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ మొత్తం 1,135 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 6,492, టీఆర్ఎస్కు 5,357 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,315 ఓట్లు లభించాయి. ► దుబ్బాక ఉపఎన్నిక తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్ఎస్ 2,867.. కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లోదుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు. ► దుబ్బాకలో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ ఫలితం అరగంటలో వచ్చే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ► దుబ్బాక ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. మొత్తం 1453 పోస్టల్ బ్యాలెట్స్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది. మొదట అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఇందుకోసం అన్నిరకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రతీ రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. అదే విధంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్ర ఆవరణలో మీడియా రూమ్ ఏర్పాటు చేసి రౌండ్ వారీగా కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్సైట్లో రౌండ్ వారీగా పొందుపరుస్తామని వివరించారు. కౌంటింగ్ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కావాల్సిన వివిధ శాఖల అధికారిక సిబ్బంది నియామకం, శిక్షణ సైతం పూర్తయ్యిందని, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపును చేపట్టాలని అధికార వర్గాలకు ఆదేశించినట్లు తెలిపారు. దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ఫోటోలు ఇక్కడ క్లిక్ చేయండి