దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌ | KTR Responds On Dubbaka Bypoll Results | Sakshi
Sakshi News home page

దుబ్బాక ఫలితం మమ్మల్ని అప్రమత్తం చేసింది: కేటీఆర్‌

Nov 10 2020 4:26 PM | Updated on Nov 10 2020 7:13 PM

KTR Responds On Dubbaka Bypoll Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీని మరింత అప్రమత్తం చేసిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫలితాలు తాము ఆశించినట్లు రాలేదని, ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటామని తెలిపారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..దుబ్బాక ఫలితాలు తమ పార్టీ కార్యకర్తలను మరింత అప్రమత్తం అయ్యేలా చేశాయని, త్వరలోనే ఫలితాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
(చదవండి : దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ)

‘2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించింది. మేము విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము. మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, పార్టీ అభ్యర్థి  గెలుపు కోసం పాటు పడిన కార్యకర్తలు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు. ఫలితాలు మేము ఆశించిన విధంగా రాలేదు. ఈ ఫలితాలు మా పార్టీ అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతంది. ఫలితాలు ఆశించిన విధంగా ఎందుకు రాలేదో, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకొని పార్టీ అధ్యక్షుడిని నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
 
కాగా,  రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement