
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో ప్రజా తీర్పును శిరసా వహిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ఎన్నిక ఓటమికి తానే బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 1079 ఓట్ల తేడాతో ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని, లోపాలను సరిచేసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి: దుబ్బాక ఫలితం మమ్మల్ని అప్రమత్తం చేసింది: కేటీఆర్)
అదే విధంగా టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు, ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఓటమి పాలైనప్పటికీ నిరంతం ప్రజాసేవకే అంకితమవుతామని, ప్రజలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హరీష్‌రావు హామీ ఇచ్చారు. కాగా టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న జరిగిన ఈ ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ, టీఆర్‌ఎస్ కంచుకోట అయిన సిద్ధిపేట జిల్లాలో కాషాయ జెండా ఎగురవేసి భారీ షాకిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment