
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమికి మనస్తాపం చెందిన పార్టీ కార్యకర్త స్వామి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు కొనయిపల్లికి వెళ్లి స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. అంత్యక్రియల అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని, సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. ‘టీఆర్‌ఎస్ కార్తకర్త మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలి. సహనం కోల్పోవద్దు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలందని కాపాడుకుంటుంది. రాజకీయం లో గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి.. కానీ అనుకోని సంఘటన జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుతున్నాను. స్వామి చాలా చురుకైన కార్యకర్త, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం లో చురుకుగా పాల్గొన్నాడు.
రాత్రి బవళ్లు పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్త. స్వామి కుటుంబానికి టీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుంది. ఈ రోజు 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించాం. భవిష్యత్తు లో కూడా స్వామి కుటుంబానికి టీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిస్తాం. టీఆర్‌ఎస్ పార్టీకి ఎంతో భవిష్యత్ ఉంది. ఎన్నో ఎన్నికల్లో గెలిచాం. కొన్ని సందర్భాలలో ఓటమిని కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ఎవ్వరు ఆందోళన చెందొద్దు. గెలిచినప్పుడు పొంగిపోవద్దు.. ఓడినప్పుడు కుంగిపోవద్దు. సమన్వయం ముదుకు వెళ్దాం’ అని హరీశ్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment