సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తున్నం దున అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) సి.పార్థసారథి కోరారు. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఫిబ్రవరి 10వ తేదీకి ముగుస్తున్నందున, ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఉందని చెప్పారు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఎస్‌ఈసీ కార్యాలయంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వార్డుల వారీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మోడల్ కోడ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై కమిషనర్ చర్చించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులతో పార్థసారథి విడివిడిగా సమావేశమయ్యారు. వారుల్డవారీగా ఓటర్ల జాబితాలను సక్రమం గా తయారు చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని వివిధ రాజకీయపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఏ వార్డులో నివసించే ఓటర్లను ఆ వార్డు జాబితాలోనే చేర్చాలని, ఒక వార్డు ఓటరు ఇంకో వార్డులో ఉండరాదని, ఒక కుటుంబంలోని ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా కచ్చితంగా నిర్ధారించుకోవాలని ఎన్నికల అథారిటీగా ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించనున్నట్లు పార్థసారథి చెప్పారు.
రాజకీయపార్టీల సూచనలు...
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచార ప్రభావం ఎన్నికలపై పడినందున, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అలాంటిది జరగకుండా ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి నియంత్రణకు చర్యలు చేపట్టాలని టీఆర్‌ఎస్ ప్రతినిధులు సూచించారు. వార్డులవారీ ఓటర్ల ముసాయిదా జాబితాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, తప్పులను సవరించాలని, ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రతి నిధులు కోరారు. బీసీ రిజర్వేషన్లను పెంచడంతోపాటు పోటీకి ఇద్దరు పిల్లల సంతానం పరిమితిని ఎత్తేయాలని, అన్ని రాజకీయపార్టీలకు అడ్వర్జైజ్‌మెంట్‌లో సమాన అవకాశాలు కల్పించాలని, కొన్ని వర్గాల ఓటర్లపై ఈ–ఓటింగ్ వర్తింపజేయడం సరికాదని టీపీసీసీ నేతలు పేర్కొన్నారు. అభ్యర్థులు భారీగా మద్యం, డబ్బులు ఖర్చు చేస్తున్నందున ఈ వ్యయానికి కళ్లెం వేసేందుకు ప్రతి డివిజన్‌లో ప్రత్యేక పర్యవేక్షక అధికారిని నియమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సూచించారు. (సీఎంకు దుబ్బాక ప్రజల దీపావళి గిఫ్ట్)
Comments
Please login to add a commentAdd a comment