సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హీట్ పీక్స్‌కు వెళ్లడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జెట్ స్పీడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా డివిజన్ మొత్తాన్ని చుట్టేయడం సాధ్యంకావడంలేదు. ఇదీ ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం తీరు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారపోకడ గతం కంటే భిన్నంగా సాగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో డివిజన్ మొత్తాన్ని చుట్టి, చివరలో ముఖ్యమైన ప్రాంతాల్లో రెండోసారి కూడా ప్రచారం చేస్తారు. కానీ, ఈసారి డివిజన్‌వ్యాప్తంగా అభ్యర్థి ప్రచారం చేసే వీలు చిక్కలేదు. ఆదివారం ప్రచారం ముగుస్తుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని పార్టీలు, అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
బస్తీల్లోనే కుస్తీ
ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పక్షం రోజుల్లోనే ఎన్నికల తంతు ముగించాల్సి వస్తోంది. అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్స్ అందించిన తర్వాత ప్రచారానికి కేవలం వారం మాత్రమే మిగిలింది. ఈ వారం రోజుల్లో డివిజన్‌లోని బస్తీలు, కాలనీలన్నింటిలో ప్రచారం చేయటం దాదాపు అసాధ్యమైపోయింది. దీంతో అభ్యర్థులు జెట్ స్పీడ్‌తో గరిష్ట ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించకున్నారు. దాదాపు మూడొంతుల ప్రాంతాలను చుట్టేయగలిగారు.
- ఎన్నికల వేళ అభ్యర్థులు మెడలో పూలమాలలు వేసుకుని, బాజాభజంత్రీలు, మందీ మార్బలంతో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు. కానీ, ఈసారి తీరు మారింది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు తిరగాల్సి రావటంతో హంగూఆర్భాటాలు లేకుండా పరుగు పరుగున ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాదయాత్రలు చేసి సాయంత్రం కార్నర్ మీటింగ్స్ జరిపేవారు. ఇప్పుడు కార్నర్ మీటింగ్స్ జోలికి వెళ్లటం లేదు. ఒకచోట మీటింగ్ పెట్టే సమయంలో పది బస్తీలు కవర్ చేయొచ్చన్న ఉద్దేశంతో పాదయాత్రలకే ప్రాధాన్యమిస్తున్నారు.
- అభ్యర్థులు మూడు, నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాలు, బస్తీలకు అభ్యర్థి వెళ్తుండగా, మిగతా ప్రాంతాలకు అభ్యర్థి తరఫున తండ్రి, సోదరులు, పార్టీ డివిజన్ స్థాయి ముఖ్యనేతలు వెళ్లి ఓట్లడగుతున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థి చిన్న కటౌట్లను వెంట పెట్టుకుని వెళ్లి దాన్ని చూపిస్తూ ఓట్లడుగుతుండటం విశేషం.
- మజ్లిస్ పార్టీ అభ్యర్థులు మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. గతంలో మైనారిటీయేతరులుండే ప్రాంతాల్లోనూ ప్రచారం చేసేవారు. ఈసారి సమయంలేక అటు వెళ్లటం లేదు.
- ఉదయం అల్పాహారం ముగించి ప్రచారం ప్రారంభించి మధ్యాహ్నం ఇళ్లకు వచ్చి భోజనం ముగించి, కుదిరితే కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం రెండోదఫా ప్రచారం చేసేవారు. కానీ, ఇప్పుడు షెడ్యూల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. వేకువజామునే ప్రచారం ప్రారంభించి, కుదిరిన చోట లంచ్ ముగించి రాత్రి పొద్దుపోయే వరకు తిరుగుతున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేస్తున్నారు.
- బస్తీల్లోనే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లోనే అభ్యర్థులు పాదయాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాలనీలకు అతి తక్కువగా వెళ్తున్నారు.
- అభ్యర్థులు ప్రచారానికి వెళ్లని ప్రాంతాల్లో వారి ప్రచార వాహనాలను ఎక్కువగా తిప్పకుండా మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.
అగ్రనేతల ప్రచారంపైనే ఆశలు..
గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి బల్దియా ఎన్నికల్లో ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ తరఫున ఒకరిద్దరు పెద్ద నేతలు మాత్రమే పాల్గొంటుండగా, టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా అగ్రనేతలతో ప్రచారం చేయిస్తున్నాయి. నిత్యం డజన్ ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భారీ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థులు వారి ప్రచారంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇంటింటి ప్రచారం కంటే అగ్రనేతల మాటలే ఎక్కువగా ఓట్లు తెచ్చిపెడతాయనీ, హామీలు, వరాలు వారి మాటల్లోనే పారుతున్నాయనీ భావించిన అభ్యర్థులు బస్తీల్లో ఓటర్లకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగటం తప్ప పెద్దగా హామీలు ఇవ్వలేకపోతున్నారు.
విజయం సాధిస్తే తమ పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని అగ్రనేతలే వివరిస్తున్నారు. వాటికి మీడియా ద్వారా భారీ ప్రచారమే సాగుతోంది. అన్ని పార్టీలు సొంతంగా సోషల్ మీడియ బృందాలు ఏర్పాటు చేసుకుని, అగ్రనేతల ప్రసంగాలను వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నారు.గెలుపోటములపై అవి ప్రభావం చూపుతాయన్న అభిప్రాయంతో అభ్యర్థులున్నారు. అగ్రనేతలు కొన్ని డివిజన్లకే పరిమితం కావటంతో వారు అడుగుపెట్టని ప్రాంతాల అభ్యర్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment