తేడా అతి స్వల్పం..! | GHMC Election Results: Narrow Margin Of Voting Percentage TRS BJP | Sakshi
Sakshi News home page

తేడా అతి స్వల్పం..!

Published Sun, Dec 6 2020 2:02 AM | Last Updated on Sun, Dec 6 2020 9:27 AM

GHMC Election Results: Narrow Margin Of Voting Percentage TRS BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా.. గతంతో పోలిస్తే ఓటింగ్‌ శాతం మాత్రం భారీగా తగ్గింది. బీజేపీ ఓటింగ్‌ శాతం మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 0.28 శాతమే కావడం, టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీకి 9,744 ఓట్లు మాత్రమే తక్కువ రావడం గమనార్హం. ఈ ఓట్ల శాతం తేడాతో 55 డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచు కోగా, 48 డివిజన్లలో బీజేపీ గెలిచింది. పాత బస్తీలో ఎంఐఎం తన ఓటు బ్యాంకును పదిల పరుచుకుని 18.76% ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ మాత్రం గతం కంటే తక్కువగా 6.67% ఓట్లకే పరిమితమైందని బ్యాలెట్‌ లెక్కలు చెబుతున్నాయి. 2016లో టీఆర్‌ఎస్‌.. 42% ఓట్లతో 99 స్థానాల్లో గెలుపొందగా, ప్రస్తుతం 34.62% ఓట్లకే పరిమితమైంది. ఇక బీజేపీ 2016లో 10% ఓట్లకు పరిమితం కాగా, ఈ సారి ఏకంగా 34.34 శాతానికి ఎగబాకింది. 2016తో పోలిస్తే అధికార పార్టీ సుమారు ఆరు శాతం ఓట్లు కోల్పోగా, బీజేపీ మాత్రం అనుహ్యంగా గతంతో పోలిస్తే 24 శాతం ఓటు బ్యాంకును పెంచుకుంది.

79 డివిజన్లలో రెండో స్థానంలో బీజేపీ
గ్రేటర్‌ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా, వీటిలో సికింద్రాబాద్, పటాన్‌చెరు, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదుర్‌పురా నియోజకవర్గాల్లో ఒక్క డివిజన్‌ను కూడా బీజేపీ రాబట్టుకోలేకపోయింది. ఎంఐఎం బలంగా ఉన్న చార్మినార్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. సికింద్రాబాద్, పటాన్‌చెరులోనూ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 11 డివిజన్లు, ముషీరాబాద్‌లో 5, సనత్‌నగర్‌లో 2, గోషామహల్‌లో 4, అంబర్‌పేటలో 2, కంటోన్మెంట్‌లో ఒకటి, యాకుత్‌పురలో 2, కూకట్‌పల్లిలో ఒకటి, మహేశ్వరంలో 2, మలక్‌పేటలో 2, కార్వాన్‌లో ఒకటి, మల్కాజ్‌గిరిలో 3, కుత్బుల్లాపూర్‌లో ఒకటి, శేర్‌లింగంపల్లిలో ఒకటి, ఉప్పల్‌ నియోజకవర్గంలో 2 డివిజన్ల చొప్పున విజయం సాధించింది. ఓడిపోయిన స్థానాల్లోనూ టీఆర్‌ఎస్, ఎంఐఎం అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. 150 డివిజన్లకు గాను 149 స్థానాల్లో పోటీ చేసి, 48 స్థానాల్లో విజయం సాధించింది. మరో 79 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లోనూ సరాసరిగా బీజేపీకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వందకంటే తక్కువ ఓట్లతో రెండు సీట్లు, 500 కన్నా తక్కువ ఓట్లతో 5 సీట్లు, వెయ్యి కన్నా తక్కువ సీట్లతో మరో 5 సీట్లను బీజేపీ కోల్పోయింది.
పార్టీల వారీగా పోలైన ఓట్లు.. 

శివారుల్లో ఇరుపార్టీలకూ జై..
బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే శివారు ప్రాంతాల ఓటర్లు ఇరు పార్టీలనూ ఆదరించారు. నగరానికి ఓ వైపున ఉన్న రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో బీజేపీ దూకుడు కనబరిస్తే.. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, పఠాన్‌చెరు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. ముఖ్యంగా ఏపీకి చెందిన సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఈ మూడు నియోజకవర్గాలు గులాబీ పార్టీకే హారతి పట్టాయి. ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 11 డివిజన్లలో కలిపి బీజేపీకి 1.29 లక్షలకు పైగా ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ 86 వేల ఓట్లకే పరిమితమైంది. మహేశ్వరంలో కూడా రెండు పార్టీల మధ్య 8 వేల ఓట్ల తేడా కన్పిస్తోంది. ఇక్కడ కూడా బీజేపీయే పైచేయి సాధించింది. రాజేంద్రనగర్‌లో కూడా బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చింది. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌కు 1.03 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, బీజేపీకి 73 వేల వరకు వచ్చాయి. కుత్బుల్లాపూర్‌లో బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌కు 30 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. పఠాన్‌చెరు, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌లో టీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఓట్లు వస్తే, అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో బీజేపీ పైచేయి సాధించింది. సికింద్రాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌కు 12 వేల ఓట్లు ఎక్కువ రాగా, సగనత్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ 3 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది.

కోర్‌సిటీలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం..
ఇక కోర్‌సిటీ అయిన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యమే కన్పించింది. గోషామహల్‌లో టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీకి దాదాపు 23 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. పాతబస్తీలో ఎంఐఎంకు ఎదురులేదని మరోసారి బల్దియా ఎన్నికలు నిరూపించాయి. చార్మినార్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, నాంపల్లి, యాకుత్‌పూర, బహుదూర్‌పుర నియోజకవర్గాల్లో పతంగి ఆధిక్యం కనబర్చింది. ఈ నియోజకవర్గాలన్నింటిలో (బహుదూర్‌పుర మినహా) ఎంఐఎం తర్వాత బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే గతంలో కంటే పాతబస్తీలో కూడా బీజేపీకి ఓట్ల సంఖ్య పెరిగిందని అర్థమవుతోంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఉప్పల్‌లో అత్యధికంగా 45 వేల ఓట్లు సాధించింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో కూడా కొంతమేర ప్రభావాన్ని చూపింది. మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్, బీజేపీ దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్‌ రాలేకపోయింది.

నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కలు...

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement