సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి, వివిధ కోటాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఓటర్లే. అలాంటి వారిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఫరీదుద్దీన్, గోరటి వెంకన్న తదితరులెందరో ఉన్నారు. వారంతా ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా, ఎక్కడి ప్రజలకు సేవలందిస్తున్నా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటరు జాబితాలో పేరుండటంతో వారు జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు అర్హులేనని అధికారులు పేర్కొన్నారు.
- ఇదే తరుణంలో గ్రేటర్ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ కొందరు మాత్రం ప్రస్తుత మేయర్ ఎన్నికకు ఓటర్లుగా లేరు. ఎందుకంటే వారు ఇప్పటికే ఇతర మునిసిపాలిటీ/కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడ అర్హత లేకుండా పోయింది.
- పదవీకాలంలో ఎక్కడైనా ఒక్కచోట మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునేందుకు అవకాశముంటుంది.
- అలా గ్రేటర్ పరిధిలోనే ఉన్నప్పటికీ, ఓటు వేసే అవకాశం లేని వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులున్నారు.
- ఇలా ఎవరెవరికి ఇక్కడ ఓటు హక్కు ఉంది? ఉన్నవారిలో ఇతర ప్రాంతాల్లో వినియోగించుకున్నదెవరు..? వంటి వివరాలు, తాజా సమాచారంతో కసరత్తు పూర్తిచేసిన సంబంధిత అధికారులు ఉన్నతస్థాయిలోని అధికారులకు వివరాలు అందజేశారు.
- తాజా సమాచారం మేరకు, అధికార టీఆర్‌ఎస్ పార్టీకి నామినేటెడ్‌లతో సహా 32 మంది సభ్యుల ఎక్స్‌అఫీషియోల బలం ఉంది.
- రెండు రోజుల ముందు ఇది 33గా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం, ఇతరత్రా కారణాలు పరిశీలించాక 32గా ఉన్నట్లు తెలిసింది. ఎటొచ్చీ.. మేయర్ ఎన్నిక జరపాలంటే నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశానికి అవసరమైన కోరం మాత్రం 97గానే ఉంది. తీరా ఎన్నిక తేదీ నాటికి ఏవైనా మార్పుచేర్పులు జరిగితే తప్ప ఇదే కోరం ఖరారు కానుంది.
- మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికకు ఓటర్లయిన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో సగం మంది హాజరు తప్పనిసరి. జీహెచ్‌ఎంసీలోని 150 కార్పొరేటర్లలో లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మరణించడంతో 149 మంది ఉన్నారు. వీరు, ఎక్స్‌అఫీషియో సభ్యులు 44 మంది కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 193. ఇందులో కనీసం సగం మంది అంటే 97 మంది ఉంటేనే ఎన్నిక జరుగుతుంది.
- గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచే గెలిచినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి వేరే చోట ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడి మేయర్ ఎన్నికలో ఓటు లేదు.
- టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గతంలో శివారు మునిసిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకున్నప్పటికీ, తిరిగి ఎన్నికయ్యాక వినియోగించుకోకపోవడంతో ఆయనకు ఇక్కడ ఓటు హక్కు ఉందని అధికారులు తెలిపారు.
- బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇతర మునిసిపాలిటీలో ఓటు వినియోగించుకున్నందున ఇక్కడ ఓటు వేయడం కుదరదు.
- ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఇప్పటి వరకు ఎక్కడా ఎక్స్‌అఫీషియో ఓటు వేయలేదని, గ్రేటర్‌లో ఓటరుగా ఉన్నందున అర్హురాలేనని సమాచారం.
- ఇలా.. ఎవరెవరు ఓటర్లుగా ఉన్నారో తేల్చుకోవడమే అధికారులకు పెద్దపనిగా మారింది. ఎట్టకేలకు ఈ కసరత్తు పూర్తిచేసి మొత్తం ఓటుహక్కున్న ఎక్స్‌అఫీషియోలు 44 మంది ఉన్నట్లు తేల్చినట్లు సమాచారం.
- టీఆర్‌ఎస్ ఎక్స్‌అఫీషియోల్లో భూపాల్‌రెడ్డి, సతీష్‌కుమార్, మహమూద్‌అలీ, ఎంఎస్ ప్రభాకర్‌రావు, లక్ష్మీనారాయణ, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, నవీన్‌కుమార్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, టి.పద్మారావు, జి.సాయన్న, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆరెకపూడి గాంధీ తదితరులున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment