సాక్షి, హైదరాబాద్ : మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికకు సమయం ముంచుకొస్తోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీనుంచే ఇద్దరూ గెలిచే అవకాశం సుస్పష్టంగానే ఉంది. కానీ, ఎంఐఎం వైఖరి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీ కార్యవర్గ సమావేశంలోనూ వీటిపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎప్పటిలాగే టీఆర్‌ఎస్‌తో అంతర్గత ఒప్పందం పాటిస్తుందా..? అంటే అవుననే వినిపిస్తోంది. లేకపోతే ఎన్నికలకు సంబంధించిన స్పెషల్ మీటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. 11వ తేదీన ఉదయం కొత్త కార్పొరేటర్ల ప్రమాణం ముగిశాక, 12.30 గంటలకు ఎన్నికల కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక కోసం నిర్వహించే స్పెషల్ మీటింగ్‌కు కోరం తప్పనిసరి. జీహెచ్‌ఎంసీలో అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు 193 మంది ఉన్నారు. వీరిలో కనీసం సగం మంది అంటే 97 మంది ఉంటేనే ఎన్నికల స్పెషల్‌మీటింగ్ జరుగుతుంది. ఏ పార్టీతో సంబంధం లేకుండా కేవలం టీఆర్‌ఎస్ సభ్యులే హాజరైతే మీటింగ్ జరిగే అవకాశం లేదు. టీఆర్‌ఎస్ బలం 88 మంది. అంటే ఇతర పార్టీల నుంచి కనీసం 9 మంది సభ్యులైనా హాజరు కావాలి.
కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు హాజరైనా సరిపోరు. కాబట్టి కచ్చితంగా ఎంఐఎం నుంచో, బీజేపీ నుంచో కొందరు సభ్యులైనా హాజరు కావాల్సిందే. పోటీలో ఆ పార్టీల అభ్యర్థులున్నా, లేకున్నా ఎంఐఎం లేదా బీజేపీల నుంచి హాజరు ఉంటేనే ఎన్నిక జరుగుతుంది. లేకుంటే మలిరోజుకు వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక జరగాలంటే ఎంఐఎం హాజరవుతుంది. ఓటింగ్ బహిరంగంగా చేతులెత్తడం ద్వారా జరగనున్నందున టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నారనుకోకుండా ఉండేందుకు ఎంఐఎం సభ్యులు పోటీలోని అభ్యర్థులెవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ గెలవలేమని తెలిసినా..టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి..తమ మద్దతు ఉన్నట్లు ప్రచారానికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటే, తమ నుంచి కూడా మేయర్, డిప్యూటీ మేయర్లకు అభ్యర్థులను నిలిపి తమ వారికి ఓట్లు వేసుకోవచ్చు.
అలా జరిగినా అది టీఆర్‌ఎస్‌కే లాభిస్తుంది. ఎంఐఎం హాజరైనా, కాకున్నా బీజేపీ తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి. తమ పార్టీ తరపున పోటీలో అభ్యర్థులను ఉంచితే తమవారికి ఓట్లు వేసుకుంటారు. లేని పక్షంలో బీజేపీ హాజరు కాకపోయినా కోరం ఉంటుంది. ఎన్నిక జరుగుతుంది. ఏం జరిగినా రచ్చ చేసేందుకు బీజేపీకి అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎటొచ్చీ టీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలే ఉన్నా ఏం జరగనుందన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
- టీఆర్‌ఎస్ నుంచి ఈసారి డిప్యూటీ మేయర్‌గా మహిళకు అవకాశం దక్కవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- మరోమారు బాబాఫసియుద్దీన్‌కు అవకాశమున్నప్పటికీ, ఈసారి మహిళకు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకనుగుణంగా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ..అల్లాపూర్ నుంచి గెలిచిన సబీహా బేగంకు అవకాశం లభించవచ్చునని తెలుస్తోంది. డిప్యూటీ మేయర్‌కు రిజర్వేషన్ లేనప్పటికీ, మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే తలంపుతో సబీహా బేగంకు అవకాశం లభించవచ్చునని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment