సాక్షి, సిద్దిపేట : పత్రికా విలేకరి నుంచి ఉద్యమకారుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మాధవనేని రఘునందన్‌రావు తాజాగా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విలేకరుల స్థాయి నుంచి పలువురు రాజకీయ నాయకులుగా ఎదిగిన చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సత్యనారాయణ ఎమ్మెల్సీగా, దుబ్బాక నుంచి దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రాంతికిరణ్ పాత్రికేయ వృత్తి నుంచి వచ్చిన వారే. అదే కోవలో రఘునందన్‌రావు సైతం చేరారు. సోలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఆయన మరణం తర్వాత మరోసారి ఒక జర్నలిస్టుగా పనిచేసిన రఘునందన్‌రావు గెలుచుకోవడం విశేషం. (గులాబీ తోటలో కమల వికాసం)
రాజకీయాలపై ఆసక్తితో...
దుబ్బాక మండలం బొప్పాపూర్‌కు చెందిన భగవంతరావు, భారతమ్మ దంపతులకు రఘునందన్‌రావు 1968 మార్చి 23న సిద్దిపేటలో జన్మించారు. డిగ్రీ (బీఎస్సీ) వరకు సిద్దిపేటలోనే చదువుకున్న ఆయన.. ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పొందా రు. అనంతరం 1991లో తన మకాంను పటాన్‌చెరుకు మార్చారు. అప్పటి నుంచి దాదాపు ఐదేళ్లపాటు ఓ తెలుగు దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూనే రాజకీయాలపై ఆసక్తితో 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో అందులో చేరారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013లో టీఆర్‌ఎస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీలో చేరి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దుబ్బాక, మెదక్ స్థానాల నుంచి పోటీ చేశారు. మూడుసార్లు ఓటమిపాలైనా పట్టువీడకుండా సోలిపేట మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు.
చివరిశ్వాస వరకు ప్రజలతోనే...
తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన గెలుపు చరిత్రాత్మకమని, టీఆర్‌ఎస్‌కు గుణపాఠమని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌కు వినపడేలా దుబ్బాక ప్రజలు తీర్పు ఇచ్చారని, ముఖ్యమంత్రికి విద్య నేర్పిన దుబ్బాకే, ఉప ఎన్నిక ద్వారా మళ్లీ విద్య నేర్పిందని వ్యాఖ్యానించారు.
ఉప ఎన్నిక కారణంగా అనేక మందిపై అక్రమ, నిర్బంధ కేసులు పెట్టారని, వారందరినీ సంగారెడ్డి జైలుకు తరలించడం, వారు ఈ విజయోత్సవంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఈ అరాచక, అప్రజాస్వామ్య, నియంత్రిత్వంపై పోరాటం చేస్తామన్నారు. తన విజయానికి సహకరించిన సిద్దిపేట సీపీ, హైదరాబాద్ సీపీలకు కృతజ్ఞతలతోపాటు తన గెలుపును సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌కు అంకితం ఇస్తున్నట్లు రఘునందన్‌రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తన గెలుపును ఆకాంక్షించారన్నారు.
తన గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా నిలిచారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment