సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, అధికారంలోకి వచ్చి తీరుతామనే ఆ పార్టీ నేతల ఆశలకు బీజం వేసింది. ఓ వ్యూహం ప్రకారం బలమైన అభ్యర్థిని రంగంలోకి దించిన బీజేపీ... అధికార టీఆర్‌ఎస్‌ను కంగు తినిపించి రాష్ట్ర రాజకీయాల్లో తన గ్రాఫ్‌ను పెంచుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ఈ విజయం మంచి బూస్ట్ ఇస్తుందని, ఇదే దూకుడు కొనసాగిస్తే రాష్ట్రంలో బీజేపీ పుంజుకొనే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా దుబ్బాక ఫలితం ఇచ్చిన కిక్కుతో రాష్ట్రవ్యాప్తంగా ఇదే హవా కొనసాగిస్తామని, త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
యువ మంత్రం.. సోషల్ మీడియా తంత్రం
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనుకూల ఫలితం వచ్చేం దుకు ముఖ్యంగా రెండు కారణాలున్నాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజాదరణ, సానుభూతి ఉన్న బలమైన నాయకుడు రఘునందన్‌రావు అభ్యర్థిత్వంతోపాటు ప్రచారపర్వంలో ప్రదర్శించిన దూకుడు ఈ విజయానికి తోడ్పడ్డాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకోగలిగామని, ఈ యువ మంత్రమే టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూర్చిన కుటుంబాల ఓట్ల ను కూడా తమ వైపునకు తిప్పిందని అంటున్నారు. ‘35 ఏళ్లలోపు యువత, నిరుద్యోగులు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారంతా రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని సమర్థించి కేంద్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని చూపారు. (గులాబీ తోటలో కమల వికాసం)
భవిష్యత్తులో అధికారం చేజిక్కించుకొనే దిశగా మా ప్రయాణానికి సులువైన మార్గాన్ని వేసిన ఫలితం’అని రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. యువతతోపాటు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కూడా కలసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీని అడ్డుకొనేందుకు అధికార పార్టీ వ్యవహరించిన తీరు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్‌రావు బంధువులపై దాడులు జరిగిన తీరును సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాయని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమ వైపునకు మళ్లేందుకు కారణమైందని చెబుతున్నారు. (విలేకరి నుంచి ఎమ్మెల్యే వరకు.. )
భవిష్యత్తు మాదే
దుబ్బాక ఫలితం పదేపదే పునరావృతం అవుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తామని, బల్దియా కోటను చేజిక్కించుకుంటామని చెబుతున్నారు. ఆ తర్వాత జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగుతుందని, ఫలితంగా ప్రత్యామ్నాయ శక్తిగా పుంజుకోవడం ఖాయ మని అంటున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని తక్కువ అంచనా వేయవద్దనే సంకేతాలను దుబ్బాక ఫలితం పంపిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును అనువుగా మలచుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment