న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ప్రతిపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశం హిందూమతమే లక్ష్యంగా జరిగిందని ఆరోపించారు. అయితే, తాము అన్ని మతాలను, ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తామని, అదేసమయంలో ఇతరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది.
మనుషుల్ని సమానంగా చూడలేని మతం మతమే కాదని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. అటువంటి మతం రోగంతో సమానమన్నారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. దేశంలోని కోట్లాదిమంది ఆచరించే సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కరణ్ సింగ్ అన్నారు.
క్షమాపణ చెప్పాలి
ఉదయనిధి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్, అశోక్ గెహ్లాట్ తదితరులు మౌనంగా ఎందుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ కూటమి హిందూ మతానికి వ్యతిరేకమని ఆరోపించింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి,అనురాగ్ ఠాకూర్ ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమి నేతలు క్షమాపణ చెప్పకుంటే దేశం వారిని క్షమించబోదన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉదయనిధిపై ముజఫర్‌పూర్‌కు చెందిన లాయర్ సుధీర్ కుమార్ ఓఝా కోర్టులో పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment