తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక తమకు ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదంటూ వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ తమ వాదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో అసంతృప్తనేతలు విడిగా సమావేశం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. అసంతృప్త నేతల సమావేశాలు ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు, నిజామాబాద్, మరో ఒకట్రెండు జిల్లాల్లో జరిగాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన భేటీ సీనియర్లు–జూనియర్లు, పాత–కొత్త నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని ఎత్తిచూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలవారీగా చూస్తే...
కరీంనగర్‌లో గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర రావు, అర్జున్‌రావు, వరంగల్‌లో డాక్టర్‌టి.రాజేశ్వరరావు, ఎం.ధర్మారావు, నిజామాబాద్‌లో యెండల లక్ష్మీనారాయణ, హైదరాబాద్ నుంచి వెంకటరమణి, మహబూబ్‌నగర్‌లో నాగూరావు నామాజీ, నల్లగొండలో కంకణాల శ్రీధర్‌రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బొబ్బ భాగ్యరెడ్డి చాలాకాలంగా పార్టీ కోసం పనిచేయడమేకాక.. గుర్రంబోడు తండాలో గిరిజనుల భూముల విషయంలో అనేక కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లి వచ్చారు. తాజాగా ఆ నియోజకవర్గంలో మరో నేత రావడంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కాగా, సీనియర్లు సుదీర్ఘకాలం రాష్ట్ర పదాధికారులుగా, వివిధ హోదాల్లో పదవులు నిర్వహించారని, పార్టీలో, ఇతరత్రా పదవులు తక్కువగా ఉన్నందున ఈసారి కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
సీనియర్లను విస్మరిస్తే ఎలా?
హైదరాబాద్‌లో కలుసుకున్న సీనియర్ నేతల్లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, టి.రాజేశ్వరరావు, చింతా సాంబమూర్తి, వెంకటరమణి తదితరులున్నారు. ‘ఇది రహస్య సమావేశమేమీ కాదు. పార్టీ బలపడుతున్న క్రమంలో కొత్తవారిని చేర్చుకోవాల్సిందే. ఏళ్ల తరబడి పార్టీ కోసం, సిద్ధాంతం కోసం కృషి చేసిన, త్యాగాలు చేసి పార్టీని రక్షించుకున్న సీనియర్లను విస్మరించడం సరికాదు. అందర్నీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంది. ఒంటెద్దు పోకడలు అనుసరించడం సరికాదు. సమస్య పరిష్కారానికి పార్టీ ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, పార్టీ సంస్థాగత జాతీయ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌జీ వెంటనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఈ అంశంపై పార్టీ స్పందించే తీరునుబట్టి తర్వాతి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం’అని భేటీలో పాల్గొన్న నాయకులు ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా అసంతృప్త నేతల సమావేశాలు, చర్యలను తేలికగా తీసుకునే ప్రసక్తే లేదన్న సంకేతాలు రాష్ట్ర నాయకత్వం ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment