రాష్ట్రంలోని 8 పెండింగ్ లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇటీవల 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసిన తెలిసిందే. బుధవారం నాటి భేటీలో పెండింగ్‌లోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కసరత్తు పూర్తిచేశాయి. ఈ క్రమంలోనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న, ఏకాభిప్రాయం కుదిరిన 9 మందితో తొలి జాబితాను ప్రకటించారు.
టికెట్ కోసం పోటీ ఉన్న ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే దానిపై కసరత్తు చేశారు. పార్టీ పరంగా అంతగా బలమైన నాయకులు లేని వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నేతల చేరికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మరో సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ సదరు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించేయడంతో.. ఆయనను మరోసీటు నుంచి బరిలో దిగాల్సిందిగా బీజేపీ నాయకత్వం కోరినట్టు తెలిసింది. దీనిపై సదరు ఎంపీ పెద్దగా ఉత్సాహం చూపడం లేదని సమాచారం. అయితే సీట్లపై ప్రాథమిక కసరత్తు ముగిసిన నేపథ్యంలో.. కొన్ని కొత్తపేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment