న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందంటూ గతవారం లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాజాగా పార్లమెంట్ ఉభయసభల్లో రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ తన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలోనూ అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
అయితే దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. అదానీ-హిండెన్ బర్గ్ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు విమర్శించారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాగా పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. లోక్‌సభ సభ్యుడైన రాహుల్ గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను సభలోని సభ్యులంతా తీవ్రంగా ఖండించాలని.. దేశానికి కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.
మరోవైపు రాజ్యసభలోనూ రాహుల్ గాంధీ అంశంపై ప్రకంపనలు రేగాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తూ.. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని సీనియర్ నేత అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు పలువురు బీజేపీ మంత్రులు కూడా మద్దతు పలికారు. అయితే దీనిపై స్పందించిన విపక్ష కాంగ్రెస్ మంత్రులు.. గతంలో నరేంద్ర మోదీ కూడా వీదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని గుర్తు చేస్తూ ఆందోళన చేపట్టారు.
అయితే గోయల్ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. సభలో సభ్యుడు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఏంటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే, నాశనం చేసే వారు దానిని రక్షించాలంటూ మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్, ఆప్ సైతం మద్దతు తెలిపాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment