అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ.. బీఆర్‌ఎస్ గత పదేళ్లపాలన తీరు ఎత్తిచూపుతూ..
వచ్చేనెల 1 నుంచి 5వ తేదీ దాకా ‘ఆరు అబద్ధాలు’పేరిట వివిధ రూపాల్లో నిరసనలకు నిర్ణయం
పార్టీ ముఖ్యనేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఓవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే, మరోవైపు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఉద్యమబాట పట్టాలని బీజేపీ ముఖ్యనేతలకు కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైన తీరు, హామీలు, వాగ్దానాల అమల్లో వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను కూడా లక్ష్యంగా చేసుకొని పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలు వంటి వాటిని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించి.. రెండు లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
డిసెంబర్ మొదటివారంలో ఏడాది పాలన పూర్తి సందర్భంగా కాంగ్రెస్ సర్కారు సంబురాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతకంటె ముందుగానే రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో చార్జిషీట్లు, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వెనుకబడడాన్ని ఎండగడుతూ ఇతర రూపాల్లో ఆందోళన, నిరసనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి 5 దాకా రాష్ట్రవ్యాప్తంగా (అసెంబ్లీ నియోజకవర్గాల్లో) ‘ఆరు అబద్ధాలు’పేరిట హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను అధికారంలోకి వచ్చాక వేటిని పూర్తిచేశారనే దానిపై డిసెంబర్ 1న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో చార్జిషీట్లు విడుదల చేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చార్జిషీట్ల విడుదలతోపాటు ఎక్కడికక్కడ బహిరంగసభల నిర్వహణకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టకపోవడంపై బైక్ ర్యాలీలు, మహిళామోర్చా ద్వారా మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీల అమల్లో వైఫల్యాలు ఎండగట్టేలా, రైతాంగానికి చేసిన వాగ్దానాల్లో అమలు తీరును ఎత్తిచూపుతూ నిరసనలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై ఆయా మోర్చాలు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
ఈ మేరకు యువ, మహిళ, కిసాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మోర్చాలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏడు మోర్చాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీలోగా ఒక్కో మండలంలో ఒక్కో మోర్చా పదిమంది చొప్పున కొత్తవారిని క్రియాశీల సభ్యులుగా చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం పార్టీపరంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో 36 లక్షల మంది సభ్యులుగా చేరారని, ఈ నెలాఖరులోగా ఆ సంఖ్యను 50 లక్షలకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి 15 దాకా పోలింగ్ బూత్ కమిటీలతో పాటు మండల కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
శనివారం పార్టీ కార్యాలయంలో అన్ని మోర్చాలు, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల కమిటీలతో వేర్వురుగా కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఈ రెండు భేటీల్లో పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుతోపాటు ఏడు మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment