
‘‘బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న బాణాలు పార్టీ ఎంపీలు. వాటిని బయటకి తీసి వదిలితే కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. రాజస్థాన్‌లో ఈ ఎంపీల బాణం గురి తప్పదు. లక్ష్యాన్ని సరిగ్గా ఛేదిస్తుంది’’ ఇదీ బీజేపీలో జరుగుతున్న చర్చ ఇది. బీజేపీ తొలి విడతగా 41 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేస్తే అందులో ఏడుగురు ఎంపీలే ఉన్నారు. అంతమంది దిగ్గజ నాయకుల్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు దింపింది ? వచ్చే లోక్‌సభ ఎన్నికల వ్యూహం ఇందులో దాగుందా ?
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఒక్కో జాబితాను విడుదల చేస్తూ ఉంటే అందులో ఉండే అతిరథ మహారథుల్లాంటి నాయకుల పేర్లను చూస్తే అందరూ విస్తుపోవాల్సి వస్తుంది. 18 మంది ఎంపీలు, నలుగురు కేంద్ర మంత్రుల్నిఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ బరిలో దింపింది. రాజస్తాన్‌ల మొదటి జాబితాలో ఏకంగా ఏడుగురు ఎంపీలున్నారు. బీజేపీ ఎంపీలైన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ , దియా కుమారి, నరేంద్ర కుమార్, బాబా బాలకాంత్, దేవ్‌జీ పటేల్, కిరోరిలాల్ మీనా, భగీరథ్ చౌధరిలు ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు.
పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడానికే ప్రధానమంత్రి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. మోదీతో కలిసి పని చేసినవారే ఇప్పుడు తమ తో కలిసి పనిచేయడానికి వచ్చారన్న భావన కార్యకర్తలకు బూస్టప్ ఇస్తుందని, ఒక్క సీటుని వదిలిపెట్టకుండా అన్నింట్లో విజయం సాధిస్తామని రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెబుతున్నారు.
విజయావకాశాలు మెరుగు
రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుంటే, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అంటే ఒక్కో ఎంపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపించగలరు. ఆ విధంగా బీజేపీ 56 సీట్లను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఏడుగురు ఎంపీలను బరిలోకి దింపింది. కేంద్ర మంత్రులైన గజేంద్ర సింగ్, అర్జున్ మేఘ్వాల్ కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
ఎంపీల ప్రజాదరణకు ఇదో పరీక్ష
2024 లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిని సెమీఫైనల్‌గా భావించవచ్చు. అందుకే బీజేపీ ఎంపీలకు ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికే బీజేపీ పెద్దలు ఎంపీలను నిలబెడుతున్నారు. ఎంపీల పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో గెలుపోటముల ఆధారంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు చేస్తారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వేవ్ ఆధారంగానే అన్ని రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు బీజేపీ కైవశం చేసుకోగలిగింది. అందులోనూ రాజస్తాన్‌లో మొత్తం 25 స్థానాలు తన ఖాతాలో వేసుకొని క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా ఎంపీలకు లిట్మస్ టెస్ట్ వంటిది.
మోదీ హవా
రాజస్తాన్‌లో బీజేపీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించడం లేదు. ప్రధాని మోదీకున్న ఛరిష్మాపైనే ఆధారపడుతోంది. దానికి తోడు స్థానిక సమస్యలు, స్థానికంగా ప్రభావం చూపించగలిగే ఎంపీలను బరిలో నిలబెడితే విజయావకాశాలు ఎక్కువవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
భగ్గుమన్న అసమ్మతి
బీజేపీ తొలి జాబితాలో ఏడుగురు ఎంపీలకు చోటు కల్పించడంపై అసమ్మతి భగ్గుమంది. విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే నర్పత్ సింగ్ రజ్వీ స్థానంలో ఎంపీ దియా కుమారికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ ఉప రాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు రజ్వీ కావడంతో రాజకీయంగా కలకలం రేగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఒక ఎంపీకి టికెట్ ఎలా ఇస్తారని రజ్వీ ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో తన భవిష్యత్ ప్రణాళిక వెల్లడిస్తానని స్పష్టం చేశారు. మరి కొన్ని అసెంబ్లీ స్థానాల్లో వసుంధరా రాజె అనుచర వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడంపైన కూడా అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఎన్నికల్లో ఎంపీలను బాణాలుగా వదిలితే అవి లక్ష్యాన్ని ఛేదిస్తాయా అన్న అనుమానాలైతే వస్తున్నాయి.
వసుంధర రాజెకు కౌంటర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆరెస్సెస్ అండదండలతో ఆమె తనకున్న స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో వసుంధరా రాజె, ఆమె వర్గీయులకు టిక్కెట్లు దక్కలేదు. రాజెకు చెక్ పెట్టడానికే బీజేపీ వ్యూహాత్మకంగా పార్టీ ప్రముఖుల్ని బరిలోకి దింపిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment