హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ.. తిరుగులేని పార్టీగా అవతరించింది. 90 స్థానాల్లో 48 చోట్ల గెలుపొంది ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
తాజాగా అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు దేవేందర్ కద్యన్, రాజేష్ జూన్.. కేంద్రమంత్రి, హర్యానా ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మోహన్‌లాల్ బడోలీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగిన కద్యన్ గనౌర్ నుంచి గెలుపొందగా.. రాజేష్ జూన్ బహదూర్‌ఘర్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు.
అయితే మరో ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ గత మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. అయితే టికెట్ రాకపోవడంతో హిసార్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆమె కూడా బీజేపీకి తన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వీరి చేరికతో పదేళ్ల పాలన తర్వాత గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించిన బీజేపీకి మరింత బలం చేకూరింది. దీంతో అసెంబ్లీలో బీజేపీ బలం 52కి చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment