సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతవాసులెవరైనా అడ్డుకుంటే చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తుంటే.. అది వద్దంటూ రైతుల ముసుగులో టీడీపీ అమరావతి–అరసవల్లి యాత్ర చేస్తోందని చెప్పారు.
రాజకీయ పార్టీలు సమీక్ష నిర్వహించుకోవడం ఆనవాయితీ అని, తమ పార్టీ అధ్యక్షుడు కూడా ఆ విధంగానే సమీక్షించారని చెప్పారు. దీనిపై పచ్చపత్రికలు ఏదేదో రాశాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేశామని, సీపీఎస్ వంటి వాటిపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలిచి తీరతామని పేర్కొన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అపర జ్ఞానిలా, అంతా ఆయనకే తెలుసన్నట్లుగా, తాము దద్దమ్మలన్నట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. మనిషిగా పెరిగాడేగానీ బుర్ర ఎదగలేదన్నారు. ‘నువ్వు మంత్రిగా పనిచేశావు కదా? మరి ఈ మూడు జిల్లాల్లో ఏంచేశావో.. నీ మార్క్ ఏమిటో చెప్పండి. అలాగే మున్సిపల్ మంత్రిగా టీడీపీ హయాంలో బండారు సత్యనారాయణమూర్తి పనిచేశారు. ఆయనైనా తన మార్క్ ఏమిటన్నది చెబుతారా?’ అని నిలదీశారు.
ప్రభుత్వ కార్యాలయం నిర్మిస్తే తప్పేంటి?
‘రుషికొండలో హరిత రిసార్టు ఉండేది. అది పాతబడిపోతే దానిస్థానంలో కొత్త గెస్ట్‌హౌస్ నిర్మిద్దామని ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడితే... దానిమీద కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం అక్కడ మరో గెస్ట్‌హౌస్ కడితే తప్పేమిటి? అక్కడ ప్రభుత్వ కార్యాలయం, సీఎం అధికార నివాసం కడితే తప్పేమిటి? గతంలో హైదరాబాద్‌లో నాటి సీఎం వైఎస్సార్ అధికార నివాసం నిర్మించారు.
ఆ తర్వాత కేసీఆర్ వచ్చాక మరో భవనం కట్టారు. ఎవరు సీఎంగా ఉన్నా అవి అ«ధికార నివాసంగా ఉంటాయి. రుషికొండ మీద ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ప్రభుత్వ కార్యాలయం, గెస్ట్‌హౌస్ కడితే తప్పేమిటి?..’ అని పేర్కొన్నారు. ‘ఏదైనా పర్యావరణ సమస్య ఉంటే సంబంధిత అధికారులు చూసుకుంటారు. ప్రభుత్వంలో ఎవరున్నా ఈ భవ నంలో ఉంటారు. పాలనందిస్తారు.
ప్రైవేట్ వాళ్లకి అప్పగించలేదు కదా రాద్ధాంతం చేయడానికి..’ అని చెప్పారు. కొన్ని దుష్టశక్తులు ప్రతి మంచిపనిని అడ్డుకుంటున్నాయని, అదే గోప్యంగా ఉంచడానికి కారణమన్నారు. అఖిలపక్షాలను రుషికొండ మీదకి తీసుకెళతామని, దాపరికమేమీ ఉండదన్నారు.
మీది రియల్ ఎస్టేట్ వ్యాపారం
‘టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది కొత్త కార్యక్రమం కాదు. గతంలో మహానేత వైఎస్సార్ కూడా చేశారు. ఇటీవలే మా ప్రభుత్వం ఇక్కడ పేదల ఇళ్లకోసం దాదాపు ఆరువేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి, డెవలప్ చేసి ఇచ్చింది. అదేమీ కొత్త స్కీం కాదే. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడం కోసం తప్ప చేసిందేముందు.
అది వాస్తవం కాదా.. అందుకే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఇక్కడ కూడా ఎవరో ఒకరు మాట్లాడతారు. వీటివల్ల రాజకీయాలు పలచన అవుతాయి. రాజకీయ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. భాష మీద అదుపు, విషయం మీద పట్టు ఉండాలి.
హుద్‌హుద్ సమయంలో విపత్తు పేరు చెప్పి రికార్డులు తారుమారు చేసి మరీ భూములు దోచుకుతిన్నది మీరు కాదా?..’ అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏపీలో కన్నా తెలంగాణాలోనే టీచర్లకు అన్ని బెనిఫిట్లు కల్పిస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్న మాటను విలేకరులు ప్రస్తావించగా, బొత్స మాట్లాడుతూ ఏపీ, తెలంగాణల్లో టీచర్లకు పీఆర్‌సీ, ఎంప్లాయి బెనిఫిట్, ఫిట్‌మెంట్‌లలో ఎవరికి ఎక్కువ వస్తున్నాయో పరిశీలించమనండని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment