మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సభలో బిల్లు పెట్టినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, దుష్టచర్యలకు పాల్పడినా బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో అంతిమంగా మంచే గెలిచిందన్నారు. విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పరిపాలనా వికేంద్రీకరణకు మార్గం సుగమం అవడంతో రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. కార్యనిర్వాహక రాజధానికి విశాఖపట్నంలో మంచి రోజు చూసుకుని ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమాంతరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.
► మంచి కోసం మునులు, దేవతలు యజ్ఞం చేస్తే రాక్షసులు పాడుచేయాలని చూసేవారని పురాణాల్లో చెప్పినట్లు ఈ బిల్లును అడ్డుకునేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు.
► అధికార వికేంద్రీకరణను అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టింది. మండలిలో రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించింది.
► అయినా గవర్నర్ బిల్లును ఆమోదించడం ద్వారా న్యాయం, ధర్మం గెలిచాయి. రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ ఆశయం నెరవేరింది.
► ఉత్తరాంధ్ర, సీమతోపాటు అమరావతినీ అభివృద్ధి చేస్తాం. భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం.
► ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం అభివృద్ధిలో ముంబయి, ఢిల్లీతో పోటీపడుతుంది.
► రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలొచ్చాయి. సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఇక ఈ సమస్యలుండవు. రాష్ట్రంలో అమరావతి అంతర్భాగం. ఆ ప్రాంత ప్రజలు వైఎస్ జగన్‌పై నమ్మకంతో గెలిపించారు. ఆ ప్రాంతాన్ని తప్పక అభివృద్ధి చేస్తాం.
పారిశ్రామిక అభివృద్ధికి 500 ఎకరాలు
భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేటాయించిన భూముల్లో మినహాయించిన 500 ఎకరాలను పారిశ్రామిక అభివృద్ధికి వినియోగిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం చేసినట్లుగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే యెచన లేదన్నారు. పార్టీ విధానాలు నచ్చి, సీఎం జగన్ పాలనను మెచ్చి పలువురు తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరికపై స్పందిస్తూ అన్నారు. ఈ అంశంలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని, పార్టీ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సిందేనన్నారు. సమావేశంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, అలజంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment