సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ వెంటనే తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీ బాస్ మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పుట్టినరోజు నాడే కేసీఆర్ హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్‌కు రానున్నారని సమాచారం.
బాస్ రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు. పుట్టినరోజు నాడు కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్‌కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బాస్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ బీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్, గజ్వేల్ క్యాంప్ ఆఫీసు వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
తాను త్వరలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నేతల సిద్ధమవుతున్నారు.
ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీ ఎంట్రీపై హింట్ ఇచ్చారు. త్వరలో కేసీఆర్ తెలంగాణభవన్‌లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు కూడా వెళ్తారని వెల్లడించారు.
తుంటి ఎముకకు సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో రీ ఎంట్రీలో కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
ఇదీచదవండి.. మేమూ రామ భక్తులమే : మంత్రి ఉత్తమ్
Comments
Please login to add a commentAdd a comment